కాకతీయుల కాలం నాటి ఏకశిలా శివాలయాల్లో కూసుమంచి గణపేశ్వరాలయం ప్రసిద్ధి గాంచింది. కాకతీయులు నిర్మించిన ఈ పురాతన శివాలయం ఖమ్మం పట్టణం నుంచి 20 కి.మీ. దూరంలోని కూసుమంచిలో ఉంది. కూసుమంచిని కాకతీయ కాలంలో కుప్రమణి అని పిలిచేవారు. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడిగా దీనికి పేరుంది. కాకతీయ పాలకులు నిర్మించిన శ్రీ గణపేశ్వర ఆలయం పై 4 SIDES TV ప్రత్యేక కథనం..
కూసుమంచి పట్టణం ఖమ్మం – నల్గొండ జిల్లా సరిహద్దుల్లో ఉంది. 11 వ శతాబ్దాలలో కాకతీయ పాలకులు నిర్మించిన శ్రీ గణపేశ్వర ఆలయం, ముక్కంఠేశ్వరాలయం అనే రెండు శివాలయాలు కూసుమంచిలోనే ఉన్నాయి. ఈ రెండు దేవాలయాలు కాకతీయ రాజుల నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. కూసుమంచి బస్ స్టాండ్ నుండి 1.7 కి.మీ దూరంలో గణపేశ్వరాలయం ఉంది. స్థానికంగా జరిగే ఈ జాతర, కళ్యాణానికి అన్ని ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు.
ఖమ్మం జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని జాతీయ స్థాయిలో ఖ్యాతి గడిస్తే … మరికొన్ని అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతలు సంపాదించాయి. గణపేశ్వరాలయం వాస్తు శిల్పంలో వరంగల్ దేవాలయం వెయ్యి స్తంభాల గుడిని పోలి ఉండే రాతితో నిర్మించారు. ఈ ఆలయంలోని శివలింగం మూడు మీటర్ల ఎత్తులో ఉంది. ఇది రాష్ట్రంలోని అతిపెద్ద శివలింగాలలో ఒకటి. ఈ ఆలయ శిల్పరీతి ప్రాచీనమైనదే కాక అత్యంత విశిష్టమైనది కూడా. ఆలయ నిర్మాణ సందర్భంలో సిమ్మెంటు సున్నం వంటి పదార్దాలతో రాళ్లను అతికించకుండా అనుసంధానం అంటే ఇంటర్ లాకింగ్ విధానంలో పెద్దపెద్దరాళ్ళకు గాడులూ, కూసాలు పద్ధతిలో బిగింపు చేయడం ద్వారా నిర్మించారు. తూర్పుముఖంగా ఉన్న ఎత్తైన వేదికపై నిర్మించిన ఈ దేవాలయ స్తంభాలు చూడచక్కగా ఉంటాయి. మూడు ప్రవేశాలతో అందంగా నిర్మింపబడ్డ భవనమే ఈ దేవాలయం.
గణపేశ్వరాయలం వరంగల్, నల్గొండ, ఇతర ప్రదేశాల నుండి శివరాత్రి పండుగ సమయంలో అధిక సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది. దేవాలయం దక్షిణ భాగంలో 15 అడుగుల ఎత్తైన వేణు గోపాల విగ్రహం ఉంది. గణపేశ్వరాలయం నుండి కొన్ని మీటర్ల దూరంలో ముక్కంటేశ్వరాలయం ఉంది. మూడు మండపాలు ఒకేలా ఉండటంతో త్రికుంటాలయం అయింది. త్రికూటాలయం అనగా.. మూడు గర్భగుడులు ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి నిర్మించిన గుడి అని అర్ధం. దీనిలోని మూడు గర్భాలయాలలోనూ శివలింగాలే నిర్మించారు. ఈ మూడు శివలింగాలతో కలిసిన మొత్తం గుడి ప్రధాన ఆలయం వైపుగా తిరిగి వుంటుంది. సామాన్య మంటపం స్తంభాలపై హంసలు , పూల నమూనాల చిత్రాలతో అద్భుతంగా చెక్కబడ్డాయి. ఖమ్మాన్ని కాకతీయులు, ముసునూరి నాయకులు, వెలమ రాజులు, రెడ్డి రాజులు, కుతుబ్ షాహి, హైదరాబాద్ నిజాంలతో సహా అనేక రాజవంశాలు పాలించాయి. ఖమ్మం జిల్లాలో భద్రాచలం, కిన్నెరసాని ఆనకట్ట , అభయారణ్యం, ఖమ్మం కోట, కూసుమంచి దేవాలయాలు, నేలకొండపల్లి బౌద్ధస్తూపం వంటి అనేక పర్యాటక ఆకర్షణలున్నాయి.
Discussion about this post