ఏపీలో ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. పోటీ చేసే పొలిటికల్ పార్టీల అభ్యర్థులకు 2024 సార్వత్రిక ఎన్నికలు కంటిమీదా కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక నిన్న మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల మధ్య మాటలు పేల్చిన తూటాల్లా పేలితే ఇపుడు ఏకంగా ప్రత్యర్థి నుండి తనకు ప్రాణహాని ఉందంటూ ఉత్తర నియోజకవర్గ జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ విశాఖ సీపీకి పిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
2019 ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కె కె రాజు.. ప్రత్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్నారు. మరో మారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అదే నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. 2014 లో ఇదే నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణుకుమార్ కూడా 2019 లో ఓటమి చవి చూసి మళ్లీ కూటమి అభ్యర్థిగా ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుండి జై భారత్ పార్టీ నుండి సీబీఐ మాజీ జెడి వివి లక్ష్మీ నారాయణ కూడా పోటీ చేస్తున్నారు. పాత కేసుల్లో నిందితుల కారణంగా తనకు ప్రాణహాని ఉందని పోలీస్ కమిషనర్ కి నేరుగా ఆయన ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కెకె రాజు తరుపున మైనింగ్ కేసులో అరెస్టయిన గాలిజనార్థన్ రెడ్డికి సంబంధించిన రాకేష్ కుమార్ తిరగడంతో జేడీ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
విశాఖ నార్త్ లో త్రిముఖ పోటీ నెలకొంది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కె కె రాజుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం విద్యావంతులు ఉండడం ఒక ఎత్తేయితే మరో వైపు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో జేడి లక్ష్మీనారాయణ పోటీ చేస్తే విద్యావంతుల ఓట్లుతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా ఆయనకే గంపగుత్తంగా పడే అవకాశం ఉంది. దీంతో కె కె రాజు ఓటమి ఖాయం అన్న టాక్ ఉత్తర విశాఖలో వినిపిస్తోంది.
గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీచినప్పటికీ.. విశాఖలోని నాలుగు నియోజకవర్గాల్లో సైకిల్ బ్రేక్ వేసింది. అయితే ఉత్తర నియోజకవర్గ స్థాయిలో ఓటర్లు సైతం ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వైపు మొగ్గుచూపే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం వైసీపీ నుండి వచ్చే పథకాలు కోల్పోవాల్సి వస్తుందనే భయంతో కెకె రాజు వెనుక ప్రచారల్లో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నప్పటికీ క్రాస్ ఓటింగ్ జరిగే పరిస్థితి లేకపోలేదు. దీనికి తోడు జేడి ఫిర్యాదు కూడా అధికార పార్టీ అభ్యర్థి ఓటమికి మూల కారణం కాబోతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
వాస్తవానికి ఉత్తర నియోజక వర్గంలో వైసీపీ నుండి కెకె రాజు, కూటమి నుండి విష్ణు కుమార్ రాజు బరిలో ఉండగా జై భారత్ అధ్యక్షుడు జేడి ఫిర్యాదు వైసీపీ వర్గాల్లో గుబులు పుట్టింస్తోంది. మరో వైపు కె కె రాజు రౌడీ గుండా అంటూ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు కూడా విమర్శిస్తున్నారు. ఇటు జెడి కూడా తనకు ప్రాణహాని ఉందని తనకు హాని తలపెట్ట దాలచిన వ్యక్తి ఇక్కడే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడని సమావేశంలో అన్నారు. మా గురువుగారిని చాలా ఇబ్బంది పెట్టారు వారి అంతు చూస్తానని ప్రస్తావించారంటూ జెడి ఫిర్యాదులో పేర్కొవడం గమనార్హం. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే..
Discussion about this post