‘మదర్ ఆఫ్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్’ ఈ హింగో రాణి
ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం లేదా పిల్ గురించి మనం తరచుగా వింటుంటాం. అసలు ఇది ఎలా వచ్చింది? దీన్ని ఎవరు తీసుకొచ్చారో తెలుసా? చాలామంది తెలియకపోవచ్చు. ఈ పిల్ మన దేశ న్యాయవ్యస్థ గతినే మార్చేసింది. న్యాయవ్యవస్థలో ఓ మూల స్థంభం గా నిలిచింది.ఈ రెండు అక్షరాల ‘పిల్’ అనే పదం ఎంతోమందికి న్యాయం చేకూర్చడమే గాక, సమాజంలో గొప్ప మార్పుకి నాంది పలకింది. ఈ ‘పిల్’ పుట్టుక ఓ మహిళ న్యాయవాది కృషి. ఆమె కథ ఎందరో యువ న్యాయవాదులకు స్ఫూర్తి. తన జీవితమంతా న్యాయం కోసం అర్పించిన ఆ స్ఫూర్తి ప్రదాత గురించి ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం.
భారత న్యాయవాది పుష్ప కపిలా హింగోరాణిని ‘మదర్ ఆఫ్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ లేదా ‘ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం’ తల్లిగా పిలుస్తారు. ఆమె 1927 నైరోబీలో జన్మించింది. విద్యాభ్యాసం అంతా కెన్యా, యూకేలలో చేసింది. ఆ తర్వాత 1947లో న్యాయవాద వృత్తిని అభ్యసించేందుకు భారతదేశానికి తిరిగి వచ్చింది. ఆ క్రమంలోనే 1979లో బీహార్లోని అండర్ ట్రయల్ ఖైదీల దుస్థితి గురించి వచ్చిన వార్తాపత్రిక కథనాలను చూసి చలించిపోయింది.ఈ చట్టాలన్నీ బాధితులు లేదా వారి బంధువులు మాత్రమే పిటిషన్లు దాఖలు చేయడానికి అనుమతిస్తున్నాయనే విషయాన్ని ఆమె గ్రహించింది.
పిటీషన్లు దాఖలు చేసే అవకాశం లేని కారణంగా అభాగ్యులు, బలహీన వర్గాల ప్రజలు చట్టాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారని ఆమె గమనించారు. ఈ సమస్యను పరిష్కరించేలా బిహార్ జైళ్లలోని అమానవీయ పరిస్థితులను సవాలు చేస్తూ అండర్ ట్రయల్ ఖైదీల తరపున హింగోరాణి తొలిసారిగా ఈ ‘పిల్’ని దాఖలు చేశారు. ఇది హుస్సేనారా ఖాటూన్ కేసుగా భారతీయ న్యాయ చరిత్రలో ఓ మలుపు తిరిగింది. ఆ తర్వాత ఆ ‘పిల్’ కాస్తా సామాజిక న్యాయం కోసం ఒక శక్తిమంతమైన సాధనంగా అవతరించింది. ఇది ఎందరో అభాగ్యులకు వరమై చట్టపరమైన పరిహారం పొందేలా చేసింది. క్రమంగా ఆ పిల్ న్యాయవ్యవస్థలో కీలక మూలస్థంభంగా మారిపోయింది. ఈ పిల్తోనే ఎన్నో సమస్యలను పరిష్కరించారు హింగోరాణి.
మహిళల హక్కులు.. లింగ సమానత్వం కోసం పోరాడారు. అలాగే వరకట్నం వంటి వివక్షాపూరిత పద్ధతులకు వ్యతిరేకంగా ఆమె ప్రచారం కూడా చేశారు. కాలుష్యనికి కారణమయ్యే పరిశ్రమలను సవాలు చేస్తూ..సహజ వనరుల పరిరక్షణ కోసం వాదించారు. ఖైదీల హక్కులు, జైలు పరిస్థితుల్లో మార్పు కోసం కూడా వాదించారు .. బాలల రక్షణ కోసం పోరాడటమే గాక బాల కార్మిక విధానాలను సవాలు చేశారు.
ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం హింగోరాణి కృషి చేశారు. తమ గోడును చెప్పుకోలేక, న్యాయం పొందలేని బలహీన వర్గాల వారికి హింగోరాణి శక్తిమంతమైన గొంతుగా మారారు. ఆమె అవిశ్రాంతంగా న్యాయం కోసం నిబద్ధత తో నిలబడి సాగించిన కృషిని భారత ప్రభుత్వం గుర్తించి అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’ తో సత్కరించింది. హింగోరాణి కథ సమాజంలో తెచ్చే శక్తిమంతమైన మార్పుకి నిదర్శనం. అంతేగాదు న్యాయం కోసం నిబద్ధతతో పోరాడేందుకు హింగోరాణి ఒక ప్రేరణ.
బీహార్ పోలీసులు సూదులు, యాసిడ్ ఉపయోగించి ఆరోపణలు ఎదుర్కొంటున్న33 మందిని అంధులను చేశారు. ఆకేసు కూడా హింగో రాణి చేపట్టారు. ఈకేసులో చివరికి బాధితులందరికీ వైద్య సహాయం, పరిహారం,జీవితాంతం పెన్షన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలా ఎన్నో సంచలనాత్మక కేసులు వాదించిన హింగో రాణి తన 86వ ఏట 2013..లో కన్నుమూశారు. ఆమె గౌరవార్ధం 2017లో సుప్రీంకోర్టు లైబ్రరీలో ఆమె చిత్రపటాన్నిఆవిష్కరించారు.
Discussion about this post