ఇటీవల దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరిగాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారానికి కొచ్చింది. గట్టి పోటీ ఇచ్చిన ఇండియా బ్లాక్ కొన్ని సీట్ల తేడాతో ప్రతిపక్షంలో కూర్చుంది. ఇదంతా బాగానే ఉంది. కానీ తాజాగా ఓ సర్వే సంస్థ ఎన్నికల్లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని వెల్లడించింది.
లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అసోసియేషన్ ఫర్ డెమార్కటిక్ రిఫార్మ్స సంస్థ ఓ సర్వే చేసింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు, చెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉన్నట్లు ఆ సంస్థ తేల్చింది. దేశ వ్యాప్తంగా 543 లోక్ స్థానాలు ఉండగా… వాటిలో 538 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య లెక్క సరిపోవడం లేదని తేల్చింది. మిగతా ఐదు నియోజకవర్గాల్లో ఒకటి ఏకగ్రీవం అయింది. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య ఎలాంటి తేడా లేకుండా ఉన్న నియోజకవర్గాలు కేవలం నాలుగేనని స్పష్టం చేసింది.
ఇక పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య తేడాను గుర్తించిన ఏడీఆర్ సర్వే సంస్థ… వాస్తవంగా పోలైన ఓట్లకంటే తక్కువగా లెక్కించిన ఓట్లు 5లక్షల 54వేల 598 ఉన్నట్లు, అదే విధంగా వాస్తవంగా పోలైన ఓట్లకంటే ఎక్కువగా లెక్కించిన ఓట్లు 35వేల 93 ఉన్నట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా 362 నియోజకవర్గాల్లో వాస్తవంగా పోలైన ఓట్లకంటే లెక్కించిన ఓట్ల సంఖ్య తక్కువగా ఉన్నట్లు చెప్పిన సంస్థ… 176 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నట్లు వివరించింది. వాస్తవంగా పోలైన ఓట్లకు లెక్కింపులో వ్యత్యాసానికి తేడా కారణంగా 5లక్షల 89వేల 691 ఓట్ల తేడా కనిపిస్తున్నట్లు ఏడీఆర్ వివరించింది.
మొత్తం 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా… వీటిలో గుజరాత్ లోని సూరత్ నియోజకవర్గం ఏకగ్రీవం అయింది. బీజేపీ అభ్యర్థి ముకేష్ కుమార్ చంద్రకాంత్ దళాల్ ఎలాంటి పోటీ లేకుండా విజేతగా నిలిచారు. ఇక పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య వత్యాసం లేని నియోజకవర్గాల్లో గుజరాత్ లోని అమ్రేలీ, కేరళలోని అట్టింగల్, లక్ష్యద్వీప్, డామన్ అండ్ డయ్యూ స్థానాలున్నాయి.
ఎక్కువ ఓట్ల తేడా వచ్చిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉండగా ఒడిశ్శా, యూపీ, తమిళనాడు, అస్సాం ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఏపీలో 89వేల 499 ఓట్ల తేడా కనిపించగా, ఒడిశ్శాలో 65వేల 269 ఓట్లు, యూపీలో 60వేల 84 ఓట్లు, తమిళనాడులో 54వేల 420 ఓట్లు, అస్సాంలో 42వేల 728 ఓట్ల తేడా కనిపించినట్లు ఏడీఆర్ సంస్థ తన సర్వేలో తేల్చింది. అత్యధికంగా ఓట్ల తేడా వచ్చిన నియోజకవర్గాల్లో తమిళనాడులోని తిరువల్లూరు స్థానం ఉంది. అక్కడ 16వేల 791 ఓట్లు తక్కువగా లెక్కించినట్లు సర్వే తేల్చింది. అదే విధంగా అస్సాంలోని కొక్రాజ్ హర్ నియోజకవర్గంలో 10వేల 760 ఓట్లు తక్కువగా లెక్కించారు. ఇక 5వేల నుంచి 10వేల మధ్య ఓట్ల తేడా వచ్చిన నియోజకవర్గాలు 15 ఉన్నాయి. సింగిల్ డిజిట్ తేడా వచ్చిన నియోజకవర్గాలు 37 ఉన్నాయి.
ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే… ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు గానూ 21 స్థానాల్లో 85వేల 777 ఓట్లు పోలైన ఓట్ల కంటే తక్కువగా లెక్కించినట్లు తేలింది. అదే విధంగా మిగతా 4 స్థానాల్లో 3వేల 722 ఓట్లు ఎక్కువగా లెక్కించినట్లు తేల్చారు. మొత్తం మీద పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడా 89వేల 499 ఉన్నట్లు సర్వే సంస్థ వెల్లడించింది. తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు గానూ 15 స్థానాల్లో 14వేల 969 ఓట్లు పోలైన ఓట్ల కంటే తక్కువగా లెక్కించినట్లు, 2చోట్ల 84ఓట్లు ఎక్కువగా లెక్కించినట్లు తేల్చింది. అంటే మొత్తం తేడా 15వేల 53ఓట్లన్నమాట.
ఇక నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే చిత్తూరు, కర్నూల్, హిందూపూర్, విజయనగరం నియోజకవర్గాల్లో 6 వేలకు పైగా ఓట్ల తేడా కనిపించింది. అమలాపురం, కాకినాడ, నరసారావుపేట నియోజకవర్గాల్లో వెయ్యిలోపు వ్యత్యాసం కనిపించింది. మల్కాజిగిరి నియోజకవర్గంలో 3వేల 946ఓట్ల తేడా ఉందని సర్వే తేల్చింది. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్ నియోజకవర్గాలు మినహా ఇతర అన్ని చోట్ల వెయ్యి ఓట్ల లోపు వ్యత్యాసం ఉంది. ఇదీ ఇటీవల ఎన్నికల్లో ఏడీఆర్ సంస్థ తేల్చిన పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడా.
Discussion about this post