ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణంతో హెలికాప్టర్ ప్రయాణాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈ లోహవిహంగాల్లో ఉన్న సంక్లిష్టతలు, వాటితో పొంచి ఉన్న ముప్పులపైకి అందరి దృష్టి మళ్లింది. ఒకప్పటితో పోలిస్తే హెలికాప్టర్లలో భద్రతా ప్రమాణాలు మెరుగుపడినప్పటికీ.. ప్రమాదం నీడలా వెంటాడుతూనే ఉంటుంది. అనుక్షణం అప్రమత్తతగా ఉన్నప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. విమానాలతో పోలిస్తే ఈ లోహవిహంగాలు కూలిపోయే ముప్పు 35 శాతం అధికంగా ఉంటుంది. ప్రతి లక్ష గంటల గగనవిహారానికి హెలికాప్టర్లు కుప్పకూలే రేటు 9.84గా ఉండగా…. విమానాల విషయంలో అది 7.26గా ఉంది. అసలు ఈ లోహవిహంగాలు ఎందుకు కూలిపోతున్నాయి. పైలెట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసుకుందాం…
డిజైన్రీత్యా హెలికాప్టర్లకు అనేక ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నాయి. వీటి ల్యాండింగ్, టేకాఫ్‌కు రన్వేలు అవసరంలేదు. నిటారుగా గాల్లోకి లేచి, అదే రీతిలో కిందకి దిగగలవు. గాల్లో చాలాసేపు ఒకేచోట నిశ్చలంగా ఉండగలవు. తక్కువ ఎత్తులో విహరించగలవు. అంతా సవ్యంగా ఉంటే ఇవన్నీ అనుకూలాంశాలు. ఈ ప్రత్యేకతలను ఉపయోగించుకొని.. విమానాలు ప్రయాణించలేని ప్రదేశాలకూ హెలికాప్టర్ల సాయంతో చేరుకోవచ్చు. ఒక ప్రదేశాన్ని గగనతలం నుంచి నిశితంగా గమనించొచ్చు. ఎక్కడైనా తేడా జరిగితే మాత్రం ఈ బలాలే బలహీనతలవుతాయి. హెలికాప్టర్ చాలా సంక్లిష్ట యంత్రం కాగా… అందులో కదిలే భాగాలు చాలా ఎక్కువ. అందువల్ల వాటికి ఎప్పటికప్పుడు మరమ్మతులు, సరైన నిర్వహణ అవసరం. పైలట్ నైపుణ్యం, చాకచక్యం చాలా ముఖ్యం. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవు.
పైలట్లు, ఏటీసీ అధికారులు, మరమ్మతులు, నిర్వహణ సిబ్బంది చేసే తప్పిదాలు కొంపముంచుతుంటాయి. విమానాలతో పోలిస్తే హెలికాప్టర్ పైలట్లకు ఎక్కువ నైపుణ్యం, అప్రమత్తత అవసరం. చాలా హెలికాప్టర్లలోని నియంత్రణ వ్యవస్థలను పైలట్లు స్వయంగా నిరంతరం నిర్వహిస్తుండాల్సి ఉంటుంది. విమానాల తరహాలో ఆటోపైలట్‌కు వాటిలో ఆస్కారం ఉండదు. దీనికితోడు విస్తృతంగా సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుండాలి. కొన్నిసార్లు ఇవి పైలట్ల పనిభారాన్ని పెంచుతాయి. అందువల్ల వారు అలసటకు గురవుతుంటారు. అలాంటి పరిస్థితులత్లో వారు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు. హెలికాప్టర్లను ఎక్కడైనా ల్యాండ్ చేసే వీలుండటమూ ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. ఒకింత ప్రతికూల ప్రదేశాల్లో కూడా దించేందుకు పైలట్లు కొన్నిసార్లు సాహసిస్తుంటారు. ఈ క్రమంలో చుట్టుపక్కల అవరోధాలను విస్మరిస్తుంటారు.
Discussion about this post