ప్రపంచంలోని ముస్లింలందరికి రమదాన్ మాసం పవిత్రమైనది. ఆనెలంతా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ముస్లింలు ఉపవాసముంటారు. దీనికి ప్రధానమైన కారణం ‘దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే.! క్రమశిక్షణ, సహనం, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘ రంజాన్ మాసం ‘ ఈ ఏడాది మార్చి 10న ప్రారంభం అయ్యింది.
రామదాన్ లో మూడు ముఖ్యమైన దశలుంటాయి. మొదటి 10 రోజులు అల్లాహ్ దయను, తర్వాతి 10 రోజులు క్షమను, చివరి 10 రోజులు నరకం నుంచి రక్షించమని అల్లాహ్ ను వేడుకుంటారు. ఓ అల్లాహ్.. నువ్వుమాత్రమే క్షమించగలవు, నువ్వు క్షమించడానికి ఇష్టపడే వాడివి.. అందువల్ల క్షమించు అని వేడుకుంటారు. దయ, క్షమ, నరకం నుంచి రక్షణపై ప్రార్థించిన వారికి అనంత దయామయుడైన అల్లాహ్ కరుణిస్తారని ముస్లింల నమ్మకం.
ఇస్లాం చాంద్రమాన కేలండర్ ప్రకారం ఏడాదిలో 9వ నెల రంజాన్ మాసం. ఉపవాసాల అనంతరం ఈద్ – ఉల్- ఫితర్ పేరుతో పెద్ద పండుగను నిర్వహిస్తారు. నెల ప్రారంభం, అంతం రెండూ చంద్రుడి నెలవంకపై ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ‘రోజా’ అనగా ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. మహ్మద్ ప్రవక్త ‘లా ఇల్లాహ.. ఇల్లాల్లహ్’ there’s no God but only allaah God”. మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు పవిత్ర ఖుర్ ఆన్ చెబుతోంది. ఈ మాసంలో రోజుకు ఐదు పర్యాయాలు నమాజ్‌తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని, నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింల ప్రగాఢ విశ్వాసం.
రంజాన్ మాసంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం, కనీసం ఉమ్మి కూడా మింగ కుండా కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. వయస్సు తారతమ్యం లేకుండా చిన్న, పెద్ద, ముసలి వారు సైతం భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉంటారు. ఉపవాస దీక్షలతో బలహీనతలు, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం చెబుతుంది. ఉపవాస దీక్షల వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రం చెబుతుంది. ఉపవాస దీక్షలు సహారీతో ప్రారంభమై ఇఫ్తార్‌తో ముగుస్తుంది.
ఇఫ్తార్ విందులు గురించి చెప్పాల్సి వస్తే ఖర్జూరపు పండు తిని దీక్ష విరమించే ముస్లింలు ఆ తర్వాత పలురకాలైన రుచికరమైన బలవర్థక వంటకాలను భుజిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రయాణంలో ఉన్న వారు ఉపవాసదీక్ష ఉప్పుతో కూడా విరమించే అనుమతి ఉంది. ఈ వంటకాలతో పాటు సంప్రదాయ వంట హలీమ్‌ను తయారు చేసుకుని తింటారు. వీటికి సంబంధించిన ప్రత్యేక హోటళ్ళు కూడా ఉన్నాయి.
కళ్లకు ‘సుర్మా’ పెట్టుకోవడం కూడా ముస్లింలు సున్నత్ గానే భావిస్తారు. ప్రవక్త హజరత్ మహ్మద్ సదా సుర్మా పెట్టుకునేవారని అంటారు. కాటుక లాగే కళ్లకు రాసుకునే సుర్మా పౌడర్ రూపంలో ఉంటుంది. ముస్లింలు అందమైన భరిణెల్లో వీటిని దాచుకొని ఇంటికి వచ్చిన అతిథులకు అత్తరుతో పాటు కళ్లకు పెట్టు కోవడానికి కూడా దీనిని ఇవ్వడం సంప్రదాయం. ప్రతి నమాజుకు ముందు సంప్రదాయం ప్రకారం ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకుని సుర్మా పెట్టుకుంటారు, ఇది కళ్ళకు మేలుచేస్తుందని నమ్ముతారు.
ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేయడం ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఇక రంజాన్ మాసంలో మత పెద్దలతో నమాజ్ చేయించడం ప్రశస్తమైనది. మసీద్ కు వెళ్ళలేనివారు తాము ఉన్న స్థలాన్ని శుభ్రం చేసుకొని ప్రార్థన చేసి అల్లాహ్ కృపకు పాత్రులవుతారు. పూర్వం ప్రార్థనల కోసం ఖర్జూరపు ఆకులతో అల్లిన చాపలు వాడే వారు. మొఘలుల కాలం నుంచి ప్రార్థనల చేసుకునేందుకు ప్రత్యేకమైన కార్పెట్లను వాడుతున్నారు. వాటిని జానిమాజ్ అంటారు. దానిపై ఖుర్ ఆన్ ను ఉంచేందుకు ఒక స్టాండును పెడతారు. అది X-ఆకారంలో ఉంటుంది. దానిని రెహాల్ అంటారు. ముస్లిం జపమాలను మిస్ బాహ్ లేదా తస్బీహ్ ఇందులో 99 ప్లస్ 1 పూసలు ఉంటాయి. ముస్లింలు రంజాన్ ఆఖరు పది రోజులు ఇళ్ళు వదలి మసీదుల్లో ఉంటూ మహాప్రవక్త అల్లాహ్ గురించి ప్రార్థనలతో ఆథ్యాత్మిక భావాన్ని పెంపొందించుకుంటారు. దీనిని ఎతేకాఫ్.. అంటారు. పండుగ ముందు రోజుతో వీరి నెలరోజుల ఉపవాస దీక్ష పూర్తవుతుంది.
పవిత్ర మాసంలో దానధర్మాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఖుర్ ఆన్ సిద్దాంతం ప్రకారం తాము సంపాదించిన దానిలో పేదవారి కొరకు కనీసం నూటికి రెండు రూపాయలు అయినా దానధర్మం చేయాలని భావిస్తారు, పండ్లు, గోధుమలు, సేమియా, బట్టలు, బంగారం మొదలైనవి దానం చేయాలని ఖురాన్ చెబుతోంది. రంజాన్ నెలలో ఇలా దానం చేస్తే నిరుపేద వారు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారన్నది ముఖ్య ఉద్దేశం. దీనినే ఫిత్రా అంటారు. ఈ దానధర్మ గుణం ,భక్తి భావన ఏడాది మొత్తం అనుసరించాలని పవిత్ర రంజాన్ నెలతో ప్రారంభిస్తారు.
ఆకలి ఎంత కఠీనంగా ఉంటుందో స్వయంగా అనుభవిస్తే తప్ప అనుభవంలోకి రాదు అనే భావనతో ఈ రంజాన్ ‘రోజా’ ఉపవాసదీక్షలు అనే సూత్రాన్ని ప్రతిపాదించారు. లోకంలో ఎంతో మంది అభాగ్యులు, నిరుపేదలు ఆకలితో అలమటిస్తూ దుర్భరమైన జీవితాలను వెళ్లబుచ్చుతున్న వారి కొరకు మానవత్వంతో విధిగా తమ సంపాదనలో కొంత శాతం కేటాయించి సాటివారికి దాన ధర్మాలు చేయాలని సూచించారు. మనకు ఆకలి వేస్తే భరించడం ఎంత కష్టమో ‘రోజా’ ఉపవాసం ద్వార తెలియజేసి సాటి నిరుపేదలకు దానధర్మాలు చేయమని పవిత్ర ఖురాన్ సూచిస్తుంది.
మానవీయ విలువలను తెలియజేసే పవిత్ర ఖురాన్ గ్రంధాన్ని తప్పకుండా ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు చదవాలి, లేదా వినాలి అనే నియమమం కుడా ఉంది. రంజాన్ పండుగ ప్రతి ఏడాది మారుతుంటుంది. దయామయుడి సందేశ గ్రంధం ఖుర్ ఆన్ ను మొదట మహ్మద్ ప్రవక్తకు ఇచ్చారు. రామద్ పదం అరబిక్ నుంచి వచ్చింది. దాని అర్థం వేడి వాతావరణం. అంటే ఆ వాతావరణంలో తేమ శాతం ఏ మాత్రం ఉండదన్న మాట. అలాంటి వాతావరణంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆహారం, నీళ్లు ఆ నెలంతా తీసుకోకుండా ఉండటమే ఉపవాసం. ఈ ఉపవాస లక్ష్యం తాము చేసిన తప్పులకు పశ్చాత్తాపం పొందేందుకే.
శారీరకంగా, మానసికంగా బాగున్న వారంతా తప్పకుండా ఉపవాసం ఉండాల్సిందే… పిల్లలకు, భౌతికంగా, మానసికంగా సరిలేనివారు, ముసలివారికి గర్భిణీలకు ఉపవాసం నుంచి మినహాయింపు ఉంటుంది. రంజాన్ లో, రోగ పీడితం కావడం లేదా ప్రయాణాలు, లేదా గర్భధారణ , లేదా చంటిపిల్లలను కలిగి ఉండి ఉపవాసం ఉండకపోతే ఏం చేయాలంటే ‘ఫిదియా’ సమర్పించాలి. అంటే నష్టపరిహారం అన్న మాట.
ప్రపంచంలోని ప్రతి ముస్లిం ఖుర్ ఆన్ ను పఠించడానికి, తరావీహ్ ప్రార్థనలు జరపడానికి ఆ నెలను ఉపయోగించుకుంటారు. అలాగే ఆ మాసం చివరిలో మహ్మద్ ప్రవక్త ఆదేశాను సారం రోజు విడిచి రోజు మసీదుల్లో రాత్రంతా ప్రార్థనలు జరుపుతారు. వాటినే లైలతుల్ ఖద్ర్ అంటారు. చివరి 10 రోజుల్లో సున్నత్ ల్ ఏతెకాఫ్ పాటిస్తారు. ఈద్ పండుగ ముందు రోజుతో ఇవి ముగుస్తాయి. జక్కాత్ అంటే వితరణ అని అర్థం. రంజాన్ లో ఇది అతి ముఖ్యం. పేదలకు, నిస్సహాయకులను ఈ వితరణను అందిస్తారు. తమ ఆస్తిని లెక్కగట్టి అందులో 2.5 శాతాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
లైలతుల్ ఖ్వద్ర్ అంటే రంజాన్ మాసంలోని చివరి 10 రోజుల్లోని బేసి సంఖ్య రోజుల్లో జరిపే రాత్రి ప్రార్థనలు. అల్లాహ్ ఆరాధనకు అది పవిత్రసమయంగా భావిస్తారు. ఆ రాత్రుల్లోనే మనుష్యులకు జ్ఞానం ఇచ్చే ఖరాన్ గ్రంధం ఇవ్వబడిందని ముస్లింల నమ్మకం. పురుషులు, మహిళలు, అనుసరించాల్సిన పద్దతులు, నరకం నుంచి మానవాళిని రక్షించడం కోసం రంజాన్ మాసంలోనే పవిత్ర ఖురాన్ ను మహ్మద్ ప్రవక్త పంపారని ముస్లింలు నమ్ముతారు.
నెల పొడుపు చంద్రుని దర్శించిన తర్వాతి రోజున ఈద్ -ఉల్ – ఫితర్ అంటే రంజాన్ పండుగను జరుపుకొంటారు. పండుగ ప్రార్థనలను ఈద్గాలోనే జరుపుతారు. నమాజ్ అనంతరం ముస్లింలు, ముస్లిమేతరులు ఒకరినొకరు స్నేహాభావం పెంపొందించుకోవడానికి ‘అలయ్ బలయ్, ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలను తెలుపుకొంటారు. పండుగ రోజు షీర్ ఖుర్మా అనబడే మధురమైన సేమియాను వండి, ఆత్మీయులకు తినిపిస్తారు. ఆరోజు ప్రార్థనలు, విందులు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడంతో ముగుస్తుంది.
Discussion about this post