అంబులెన్స్ అంటే.. కేవలం రోగులను తరలించే వాహనం కాదు.. చావుబతుకుల్లో ఉన్న వారిని కాపాడేందుకు ఆ దైవమే పంపించిన సంజీవని రథంగా ప్రజలు భావిస్తారు. అంబులెన్స్ సైరన్ వినిపిస్తే చాలు.. ఎంత తొందరలో ఉన్నా.. అందులో ఎవరు ఉన్నారు ఏంటీ అన్నదేమీ ఆలోచించకుండా.. మానవత్వంతో సైడ్ ఇవ్వటమే కాదు.. అందులో ఉన్నవారికి ఏమీ కాకూడదని మనసులో కోరుకుంటుంటారు.
ఇలాంటి అంబులెన్స్ పేరుతో కొంత మంది దందాలు చేస్తున్నారు. అత్యవసర సేవలకు మాత్రమే వినియోగించాల్సిన అంబులెన్సులను.. సాధారణ ప్రయాణికులను చేరవేసే ట్రావెల్స్ వాహనాలుగా వాడుతూ.. జేబులు నింపుకుంటున్నారు.అంబులెన్స్ పేరుతో.. లోపల రోగులు లేకున్నా.. సైరన్ వేసుకుని ఎంచక్కా వెళ్లిపోతున్నారు. అంబులెన్స్ వాహనాలకు ట్రాఫిక్ నిబంధనల నుంచి మినహాయింపు కల్పించటంతో.. వాటిని దుర్వినియోగం చేస్తున్నారు . ట్రాఫిక్ పోలీసులను బురిడీ కొట్టిస్తున్నారు. లోపల ఎవరున్నారన్నది బయటికి కన్పించకుండా ఉండేందుకు తమ వాహనాలకు బ్లాక్‌ఫిల్మ్‌లను వినియోగిస్తూ నిబంధనలను విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈ దందా గురించి పోలీసులకు సమాచారం అందటంతో.. అంబులెన్స్‌లపై దృష్టి సారించారు. పలు జిల్లాల అంబులెన్స్‌లపై వారం రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా.. 31కి పైగా నకిలీ అంబులెన్స్‌లను పోలీసులు గుర్తించారు. ఇందులో 5 అంబులెన్స్‌లకు ఎలాంటి పర్మిట్ లేదని తేలింది. డ్రైవర్లకు లైసెన్స్‌లు కూడా లేవని పోలీసులు గుర్తించారు. ఆర్టీఏ నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నడుపుతున్న వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసినట్టు తెలిపారు. మరి కొన్ని అంబులెన్స్‌ల డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇవ్వటమే కాకుండా జరిమానాలు కూడా విధించినట్టు తెలిపారు.
Discussion about this post