లోక్ సభ ఎన్నికల్లో 272 సీట్లు గెలవకుంటే బీజేపీ ప్లాన్ ‘ బి ’ ఏమిటని మీడియా అమిత్ షాను అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అలాంటి పరిస్థితి తలెత్తబోదని, అందువల్ల ప్లాన్ బి గురించి ఆలోచించనవసరం లేదని ఆయన బదులిచ్చారు.
ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం చేపట్టాలంటే లోక్ సభలో 543 సీట్లకు గాను 272 సీట్లు గెలవాల్సి ఉంటుంది. ఒక వేళ గెలవలేక పోతే మీ ప్లాన్ ‘బి’ ఏమిటని మీడియా ప్రశ్నించగా దేశంలోని 60 కోట్ల మంది ప్రజలు కులం, మతం, వయస్సులకు అతీతంగా మోడీ ప్రభుత్వం నుంచి లబ్ది పొందుతున్నారని, వారంతా 400 సీట్లు ఇస్తారని అమిత్ షా ఏఎన్ఐ కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ప్లాన్ ‘ఎ’ సరిపోతుందని, బి అక్కర్లేదని ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు మోడీ పెద్ద మద్దతుదారుడన్నారు. బీజేపీ ఉత్తర- దక్షిణ భారత్ లను విడదీస్తుందన్న కాంగ్రెస్ ఆరోపణలపై ప్రశ్నించగా, కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతోందన్నారు.
దేశాన్ని విభజించాలని ఎవరైనా అంటే అది అత్యంత అభ్యంతరకరం అన్నారు. ఈ దేశం ఎప్పటికీ కలసే ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలను చేస్తోందని, ప్రజలు దానిని గమనించాలన్నారు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం నడవాలంటే 400 సీట్లు తప్పనిసరి అన్నారు. రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉన్నప్పటికీ, ఎప్పుడూ అలా చేయలేదన్నారు. సరిహద్దు ప్రాంతాలను కాపాడు కోవాలన్నా, ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవాలన్నా.. పేదలకు సంక్షేమం అమలు చేయాలన్న ప్రజలు బీజేపీకి 400 లోక్ సభ సీట్లు ఇవ్వాలన్నారు. బీజేపీ 400 సీట్లను కోరుకునేది రాజ్యాంగాన్ని మార్చడం కోసమే అని కాంగ్రెస్ ఆరోపించడాన్ని ఆయన తప్పు బట్టారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ కుట్రపన్నుతోందని అమిత్ షా విమర్శించారు.
Discussion about this post