భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు. భారత దిగ్గజ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ నాడు సృష్టించిన అద్భుతం క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అంతర్జాతీయ క్రికెట్లో అదొక పెను సంచలనం. టీమిండియా ఓటమి ఖాయమనుకున్న టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమే జరిగింది. లక్ష్మణ్-ద్రావిడ్ కలిసి జట్టును ఓటమి నుంచి రక్షించడమే కాకుండా అపూరపమైన విజయాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగుల వెనకబడి ఉన్న జట్టును ఫాలో ఆన్‌లో అనూహ్యంగా భారీ అధిక్యంలోకి తీసుకెళ్లారు. ఆస్ట్రేలియా ముందు ఏకంగా 384 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. ఈ క్రమంలో లక్ష్మణ్-ద్రావిడ్ నెలకొల్పిన 376 పరుగుల భాగస్వామ్యం క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. లక్ష్మణ్-ద్రావిడ్‌ల అద్భుత భాగస్వామ్యానికి నేటికి 23 ఏళ్లు గడిచిపోయాయి.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు రెండో టెస్ట్ మ్యాచ్‌లో తలపడ్డాయి. అప్పటికే మొదటి టెస్టులో ఓడిన టీమిండియా సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. కానీ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఏకంగా 274 పరుగులు వెనుకబడింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. భారత జట్టు 171 పరుగులు మాత్రమే చేసింది. భారత జట్టుకు ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఇచ్చింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకుంటే అదే ఎక్కువ అనుకున్నారు. కానీ తెలుగు ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్- రాహుల్ ద్రావిడ్ కలిసి అద్భుతమే చేశారు. భారత జట్టు 232 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరు జత కట్టారు. ఐదో వికెట్‌కు ఏకంగా రికార్డు స్థాయిలో 376 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో లక్ష్మణ్ భారీ డబుల్ సెంచరీతో, ద్రావిడ్ భారీ సెంచరీతో చెలరేగారు. అనంతరం భారత్ విసిరిన 384 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ఆస్ట్రేలియా జట్టు 212 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 171 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఊహించని ఓటమితో కంగారులు షాక్‌లోకి వెళ్లిపోయారు.
Discussion about this post