ప్రధాన రోడ్ల వెంట మన ప్రయాణం చేస్తున్నామంటే కొంత దూరం వెళ్లగానే టోల్ గేట్ మనకు తారస పడుతోంది. టోల్ గేట్ రావడానికి కొంత దూరం నుంచే ఆ టోల్ గేట్ ను తెలిపే బోర్డులు ఏర్పాటు చేసి ఉంటాయి. అన్ని ప్రాంతాల్లో పరిస్థితి వేరు… అనంతపురంలో పరిస్థితి వేరు. ఇక్కడి ప్రధాన రహదారిలో ఉన్న టోల్ గేట్ ను చూసిన ఎవరికైనా అది నిజమైన టోల్ గేటా? లేక ఉత్తుత్తి టోల్ గేటా? అనే అనుమానం రాక మానదు. ఎలాంటి బోర్డు ఏర్పాటు చేయకుండా, సర్వీసు రోడ్లు లేకుండా కొనసాగుతోన్న అనంతపురం జిల్లా వడ్డిపల్లి టోల్ ప్లాజా విచిత్ర పరిస్థితిపై ఫోర్ సైడ్స్ టీవీ అందిస్తోన్న ప్రత్యేక కథనం…
ఇదిగో మీరిప్పుడు చూస్తున్నదే అనంతపురం జిల్లాలోని వడ్డిపల్లి టోల్ గేట్. చూడండి టోల్ గేట్ కు ఇటు వైపు గానీ, అటు వైపు గానీ కనీసం ఒక్క బోర్డైనా ఏర్పాటు చేశారా? ఇది టోల్ గేటే అని ఎలా తెలుస్తుంది ప్రయాణికులకు? వేగంగా వచ్చే వాహనదారులు అది టోల్ గేటే అని తెలిసే విధంగా ఇక్కడ ఎలాంటి ప్రకటన బోర్డులు కనిపించవు. సాధారణంగా ఏ చోట టోల్ గేట్ ఏర్పాటు చేసినప్పటికీ… విధిగా ప్రకటన బోర్డు ఏర్పాటు చేసి ఉంటాయి. అవి కూడా భారీ సైజులో ఉంటాయి. ఆ బోర్డులపై ఏ వాహనానికి ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించాలి? కారుకు ఎంత? బస్సుకెంత? లారీలకు ఎంత? ఒకవైపు మాత్రమే వెళితే ఛార్జి ఎంత వేస్తారు? రాను పోను కోసమైతే ఎంత? ఒకవేళ నెల రోజల కోసం ఒకేసారి చెల్లించే వారికి ఎంత మొత్తం? అనే వివరాలన్ని క్షుణ్ణంగా రాసి ఉండాలి.
అంతే కాదు. మరో కిలో మీటరు దూరంలో టోల్ గేట్ వస్తోందని… మరో 500 మీటర్ల దూరంలో టోల్ గేట్ వస్తోందని… తెలిపే విధంగా కూడా చాలా చోట్ల టోల్ గేట్ల వద్ద భారీ బోర్డులు ఏర్పాటు చేస్తారు. వాటిని రోడ్డు పక్కన ఉంచడంతో వాహనదారులు టోల్ గేట్ వస్తోందని తెలుసుకుంటారు. అయితే అనంతపురం జిల్లాలోని వడ్డిపల్లి టోల్ గేట్ పరిస్థితి మిగతా చోట్ల ఉన్న టోల్ గేట్లకు భిన్నంగా కనిపిస్తోంది. ముందస్తుగా టోల్ గేట్ వస్తోందని తెలిపే ఎలాంటి నోటీసు బోర్డులు ఏర్పాటు చేయలేదు. అదే విధంగా కనీసం వాహనాలకు చెల్లించాల్సిన టోల్ ఛార్జీల వివరాలు తెలిపే బోర్డులు కూడా అక్కడ ఏర్పాటు కాలేదు. దీంతో ఆ మార్గంలో వచ్చే వారికి అక్కడొక టోల్ గేట్ ఉందన్న విషయం కూడా అర్థం కాదు. బోర్డులు ఏర్పాటు చేయకపోవడంలోని ఆంతర్యమేమిటో టోల్ గేట్ కాంట్రాక్టరుకే తెలియాలి.
సుమారు మూడేళ్లుగా వడ్డిపల్లి టోల్ గేట్ కొనసాగుతోంది. నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాల్సిన బోర్డులు కాంట్రాక్టరు ఏర్పాటు చేయలేదు… అది సరే… మరి ఆ బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదని అడిగే అధికారులకు కూడా వాటిపై ద్యాస ఉండటం లేదంటే… ఇందులో ఏదో జరుగుతోందని వాహనదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గం అనంతపురం నుంచి కర్నాటక వైపు వెళుతోంది. నిత్యం అనంతపురం నుంచి కర్నాటక వైపు… అదే విధంగా కర్నాటక నుంచి అనంతపురం వైపు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎదురెదుగా వెళ్లేందుకు వీలుగా రెండు రోడ్లు ప్రత్యేకంగా ఉండాలి. కానీ ఇక్కడి టోల్ గేట్ వద్ద రెండు రోడ్లు నిర్మించలేదు. దీంతో ఒకే మార్గంలో ఎదురెదురుగా వాహనాలు వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు చెబుతున్నారు.
అనంతపురం జిల్లా కేంద్రం నుంచి కర్ణాటక రాష్ట్ర సరిహద్దు వరకు సుమారు 115 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం చేశారు. సాధారణంగా ఏ జాతీయ రహదారికైనా ఫోర్ లేన్ ఉంటోంది. కానీ అనంతపురాన్ని కలిపే జాతీయ రహదారి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఒకవైపు రావడానికి… మరోవైపు వెళ్లడానికి వీలుగా మాత్రమే దీన్ని నిర్మించారు. ఫోర్ లేన్ లేనప్పటికీ అనంతపురానికి సమీపంలో వడ్డిపల్లి దగ్గర టోల్ గేట్ ఏర్పాటు చేశారు. ఈ జాతీయ రహదారి అనంతపురం నగరం గుండా వెళ్లే ఎన్ హెచ్ 44 మరియు కర్ణాటకలోని ముల్కల్మూరు లోని జాతీయ రహదారికి అనుసంధానంగా… రెండవ జాతీయ రహదారిగా 544 డీడీ జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. పేరుకే జాతీయ రహదారి. వాస్తవానికి ఆ స్థాయిలో నిర్మాణం జరుగలేదు.
ప్రజల నుంచి టోల్ వసూలు కోసం ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలేవీ తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తోన్నాయి. ప్రధాన రహదారి వెంట హెచ్చరిక బోర్డు గానీ, టోల్ రేట్లు తెలిపే బోర్డులు గానీ, ఇరు వైపులా వాహనాలు వెళ్లేందుకు వీలుగా రోడ్డు సదుపాయం గానీ ఏర్పాటు కాలేదు. ఫాస్ట్ ట్రాక్ సెన్సార్లు కూడా ఈ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేయలేదు. కానీ వాహనదారుల నుంచి భారీగా టోల్ టాక్స్ వసూలు చేస్తున్నారు. నిజానికి ఎంత చెల్లించాలో కూడా వాహనదారులకు తెలియదు. అక్కడి టోల్ ప్లాజా సిబ్బంది చెప్పినంత చెల్లించాల్సిందే. దీన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాంట్రాక్టర్ ఇష్టారాజ్యానికి కారణమని వాహనదారులు ఆరోపిస్తున్నారు. చూడాలి మరి ఇప్పటికైనా టోల్ గేట్ వద్ద బోర్డులతో పాటు, సర్వీసు రోడ్డు సదుపాయం ఏర్పాటు చేస్తారో? లేదో?
Discussion about this post