విశాఖ మన్యంలో పర్యాటకుల సందడి కొనసాగుతోంది. ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అందాల అరకులోయ పర్యాటకులతో సందడిగా మారింది. ప్రకృతి సహజసిద్ద అందాలకు నిలయమైన అరకులోయలో ప్రస్తుతం పొగమంచు దట్టంగా కురుస్తోంది . మంచు కురిసే వేళలో మన్యం అందాలు, ప్రకృతి సోయగాలు ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇక ఈ కాలంలోనే పూసే వలిసే పూలు పర్యాటకుల మనసును దోచుకుంటున్నాయి. సుందరమైన వలిసే పూల సొగసుల మధ్య ఫోటోలు, సెల్ఫీలు దిగుతున్నారు.
ఎత్తయిన కొండల మధ్య కురుస్తున్న పొగమంచు, మేఘాలు భూమిని తాకుతున్నాయా అన్నట్టుగా కనువిందు చేస్తుంటే ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించే వారు అరకులోయ మంచు అందాలకు ముగ్ధులై పోతున్నారు. గజగజ వణికి పోయే చలిలోనూ సంతోషంతో తడిసి ముద్దవుతున్నారు. ఆంధ్రా ఊటీ అని పేరెన్నిక గన్న అరకులోయలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయినప్పటికీ పర్యాటకులు మాత్రం ఈ సీజన్లో అరకు అందాలను చూడడానికి అరకుకు క్యూ కడుతున్నారు.
అరకులోయలో వేకువజామున దర్శనమిచ్చే మంచు మేఘాలు పాలసముద్రాన్ని తలపిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. ఇక అరకులోయ సమీపంలో ఉన్న మాడగడ గ్రామం వద్ద ఎత్తయిన కొండల మధ్య కురుస్తున్న మంచు అద్భుత దృశ్యంగా కనువిందు చేస్తోంది. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న కాశ్మీర్ కి వెళ్లే బదులు, అద్భుతమైన అరకు అందాన్ని చూస్తే చాలు అన్న భావన చాలామందికి కలుగుతుంది. ఇదిలా ఉంటే డుంబ్రిగూడ మండలం లోని వలిసె పూలు పర్యాటకులకు సాదర స్వాగతం పలుకుతున్నాయి. కేవలం శీతాకాలంలోనే పూసే ఈ పూలు అరకు కు వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
Discussion about this post