కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2024-25 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ లో యన్ డి ఏ భాగస్వామి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు పెద్ద ఎత్తున వరాలు ప్రకటించారు. ఇందులో బీహార్ విషయాన్ని ప్రక్కన పెడితే ఆంద్ర ప్రదేశ్ పేరు ప్రముఖంగా ప్రస్థావనకు వచ్చింది. ఆంద్ర ప్రదేశ్ అవసరాల గురించి ఆర్థిక మంత్రి ముఖ్యంగా ప్రస్థావిస్తూ ఆంద్ర ప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన పలు హామీలను నెరవేర్చేందుకు కేంద్రంగా గట్టిగా ప్రయత్నిస్తుందని వెల్లడించారు. ఆంద్ర ప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణానికి 15000 వేల కోట్ల రూపాయలను వివిధ ఏజెన్సీల ద్వారా త్వరితగతిన ఆందజేస్తామని ప్రకటించారు. ఇది వివిధ ఏజెన్సీల ద్వారా లోను రూపంలో ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిని పూర్తి చేయడానికి వినియోగించడానికి అందుతుంది. అంతే గాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన చర్యలన్నీ కేంద్రం తీసుకొంటుందని తెలిపారు. ఇందుకు అవసరమైన నిధులన్నీ విభజన చట్టం ప్రకారం కేంద్రమే భరిస్తుందని హామీ ఇచ్చారు. వైజాగ్ చైన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ను త్వరితగతిన పూర్తి చేస్తామని అలానే హైదరాబాదు బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా ఉన్న ఓర్వకల్ నోడ్ ను అవసరమైన అన్ని సదుపాయాలు కలిపించడానికి కూడా అవసరమైన నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆంద్ర ప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నట్లు రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంద్ర పరిథిలోని మొత్తం ఏడు పాత జిల్లాలు వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక నిథులను కూడా అందజేస్తామని తెలిపారు. అయితే ఈ నిధులన్నీ ఎప్పటిలోగా వస్తాయి ప్రస్థుత ఆర్థిక సంవత్సరంలో వచ్చే నిధులెన్ని అన్న విషయం గురించి నిర్మలా సీతారామన్ స్పష్టంగా ప్రకటించకపోవడం గమనించాల్సిన విషయం. దీనిపై పూర్తి స్థాయి బడ్డెట్ కేటాయింపులు తెలిస్తేనే అవగాహన వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ గత పదేళ్ల నుండి ఆంద్ర ప్రదేశ్ కు ఇవ్వకుండా పెండింగ్ లో ఉన్న అంశాలే. గతంలో కూడా ఎన్నో సందర్భాలలో కేంద్రం ఈ విషయాలపై హామీ ఇచ్చింది అయితే ఒరిగిందేమీ లేదు. అందుకే ఈ విషయాలన్నింటిపై ప్రతిపక్ష పార్టీలు పెదవి విరుస్తున్నాయి. పదేళ్ల గా అధికారంలో ఉన్న ఇదే కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయకుండా ఇపుడు తెలుగుదేశం మీద ఆధారపడిన వేళ స్పష్టమైన ప్రకటన చేయకుండా రాజకీయ ప్రకటనలలాగా హామీలు ఇవ్వడాన్ని వీరు ప్రశ్నిస్తున్నారు. అదే సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అధికార కూటమి నాయకులు మాత్రం ఈ హామీలన్నీ ఈ ఆర్థిక సంవత్సరంలోనే కార్యరూపం దాలుస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన విభజన చట్ట హామీలు ఇప్పటికైనా మోడీ మూడవ సారి అధికారంలోనికి వచ్చిన తర్వాత ప్రాధాన్యత క్రమంలో మొదటి స్థానానికి రావడం ఆంద్ర ప్రదేశ్ కు శుభపరిణాం. వీటిని అమలు చేస్తే యన్ డి ఏ కూటమి పట్ల ప్రజలలో విశ్వసనీయత ఏర్పడుతుంది లేదంటే ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు.
Discussion about this post