మన్యం వీరుడు అల్లూరి జిల్లా పాడేరు ప్రాంతంలో ఇప్పుడో వ్యక్తి పేరు మారుమోగుతోంది. అలాగని ఆయన ఇటీవల ఎన్నికల్లో అనుకోకుండా గెలిచిన నాయకుడు కూడా… సమాజం కోసం ఏదో సాధించిన అసామాన్యుడు అంతకన్నా కాదు… ఇద్దరు భార్యలు బతికుండగానే ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న గిరిజనుడు. ఇంతకీ ఆయన మూడు పెళ్లిల్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో… మూడు పెళ్లిల్లు చేసుకున్న తర్వాత స్థానికులు ఏమనుకుంటున్నారో… తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లే మూడో పెళ్లికి వేదికైన ప్రదేశం… ఇంటి ముందు అరటాకులతో వేసిన పందిరి ఇంకా పచ్చగానే ఉంది. పెళ్లి కోసం తెచ్చిన కుర్చీలు, షామియానా, ఇతర సామాగ్రి అక్కడే ఉన్నాయి. కానీ పెళ్లి కొడుకు ఇంటికి మాత్రం తాళం వేసి ఉంది. కొత్తగా పెళ్లి జరిగిన ఇంట్లో పెళ్లి కొడుకు లేదు. అతన్ని పెళ్లి చేసుకొన్న కొత్త పెళ్లి కూతురూ లేదు. అంతే కాదు. ఆయనతో ఇప్పటి వరకు కాపురం చేస్తున్న ఇద్దరు భార్యలు కూడా లేరు. ఇద్దరు భార్యలు బతికుండగానే… వారికి విడాకులు ఇవ్వకుండా మూడో పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తి ఎవరు? ఎందుకని ఆయన మూడో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ప్రస్తుతం పాడేరు ప్రాంతంలో పెద్ద చర్చే నడుస్తోంది.
మనమిప్పుడు ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తే తాజాగా మూడో పెళ్లి చేసుకున్నది. చూడండి దర్జాగా ఇద్దరు భార్యలతో కలిసి ఆయన గారు తీయించుకున్న ఫోటో. ఈయన గారి పేరు పండన్న… ఉండేది కించురు గ్రామం… చేసేది అందరిలాగే వ్యవసాయం… ఈయన గారి మూడో పెళ్లి ముచ్చట గురించి చెప్పుకునే ముందు… ఆయన ఉంటున్న ఇంటకి… చేరాలంటే ఫోర్ సైడ్స్ టీవీ చాలా దూరమే ప్రయాణించాల్సి వచ్చింది. పండన్నను చేరేందుకు ఫోర్ సైడ్స్ టీవీ ఓ కొండనే దాటింది. ఆయన ఇంటికి చేరే ముందు ఫోర్ సైడ్స్ టీవీ సాగించిన ప్రయాణం ఏ విధంగా సాగిందో చూడండి.
ఈ కొండ ప్రాంతంలో ఉన్న మట్టి బాటన మాత్రమే పండన్న ఉండే గ్రామాన్ని చేరుకోగలం. కొండ ప్రాంతంలోని దారిలో ఎత్తుపల్లాలు… రాళ్లు, రప్పలు… సెలయేళ్లు కూడా దాటాల్సి వచ్చింది. ఫోర్ సైడ్స్ టీవీ వెళ్లిన సమయంలో భారీ వర్షం కురిస్తే… ఇక ప్రయాణం అర్థాంతరంగా ముగిసినట్లే. ద్విచక్ర వాహనం ముందుకు వెళ్లదు… అలాగని వెనక్కి తిరిగి రాదు. సెలయేరు దాటిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నప్పుడు ఒక్కసారిగా భారీ వర్షం కురిసి కొండ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా సెలయేరు ఉప్పొంగితే కూడా బయటి ప్రపంచానికి రావడం కష్టమే. ఇక తావావరణం అనుకూలించి వర్షం కురవక పోయినా… దారిలో ఫోర్ సైడ్స్ టీవీ బృందం తీసుకెళ్లిన ద్విచక్ర వాహనం అనుకోకుండా మొరాయిస్తే అంతే సంగతులు. అప్పటి దాకి వాహనంపై వెళ్లిన వాళ్లు… అదే వాహనాన్ని మోసుకొని రావాల్సిన పరిస్థితి.
పాడేరు ప్రాంతంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పండన్న పరిస్థితి తెలుసుకోవాలంటే… ముందుకు సాగాల్సిందే. కాబట్టి ఫోర్ సైడ్స్ టీవీ ముందుకు వెళ్లింది. మరింత దూరం వెళ్లాక మాకో వ్యక్తి తారసపడ్డారు. కొండ ప్రాంతంలో వాడాల్సిన వాహనం ఏమిటో అతన్ని చూస్తే మాకర్థమైంది. చూడండి ఎంత చక్కగా గుర్రంపై సవారీ చేస్తున్నాడో ఆ వృద్దప్యంలో. ఆయన చూసిన తర్వాత గానీ కొండ ప్రాంతాల్లో గుర్రం చక్కగా ఉపయోగ పడుతుందని తెలిసింది. ఆయన్ను కూడా దాటుకుంటూ ఇంకాస్త దూరం వెళితే దారికెదురుగా సెలయేరు వచ్చింది. అక్కడ కాలి నడక తప్పదు. సెలయేరు కూడా దాటి… మొత్తం మీద పండన్న ఉంటున్న గ్రామానికైతే చేరాము.
పండన్న ఊరిని చేరడానికి కొండలన్నీ దాటాము. కానీ ఆయన ఇంటిని చేరాలంటే ఇక కాలి బాట తప్పదు. చూడండి ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని చోట ఆయన ఇల్లు ఉంది. ఈ కథంతటికీ కారకుడైన పండన్న ఇల్లు వచ్చింది. కానీ ఆయన మాత్రం ఇంట్లో లేడు. ఆయన కాదు. ఆయన ఇద్దరు పాత భార్యలు, తాజాగా పెళ్లి చేసుకున్న మూడో భార్య సహా ఎవరూ ఇంటిలో లేరు. అసలు ఇంటికే తాళం వేసి ఉంది. విషయం తెలుసుకోడనికి గ్రామానికి చెందిన ఇరుగు పొరుగు వారిని విచారిస్తే పండన్న మూడో పెళ్లికి ఇద్దరు భార్యలు అంగీకరించినట్లు తేలింది. వ్యవసాయం చేసుకునే పండన్నకు తల్లిదండ్రులు ఎవరూ లేరు. ఇంట్లో ఒంటరిగా జీవించేవాడు.
తల్లితండ్రులిద్దరినీ కోల్పోయి ఒంటరి ఉంటున్న పండన్న జీవితాన్ని చూడలేని బంధువులు అదే గ్రామానికి చెందిన అప్పలమ్మతో 2001లో వివాహం చేశారు. వీరికి సంతానం కలుగక పోవడంతో నాలుగేళ్ల తర్వాత పండన్న 2005లో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య పార్వతమ్మక ఒక కుమారునికి జన్మనిచ్చింది. ఇద్దరు భార్యలతో పండన్న కాపురం సాఫీగానే సాగుతుంది. ఇన్నేళ్ల తర్వాత పండన్నకు మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకోవాలనే కోరిక పుట్టిందో తెలియదు. కానీ ఇద్దరు భార్యలకు చెప్పి వారిని ఒప్పించి ముచ్చటగా లక్ష్మీ అనే అమ్మాయిని మూడో పెళ్లి చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు.
ఇదంతా సరే… మూడో పెళ్లి చేసుకున్న పండన్న ఎక్కడికి వెళ్లాడు? ఆయన ముగ్గురు భార్యలు ఎక్కడున్నారు? అనే ప్రశ్నలకు స్థానికంగా సమాధానం దొరకడం లేదు. ఇద్దరు భార్యల సమ్మతితోనే పండన్న వివాహం చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇద్దరు భార్యలు ఆయన మూడో పెళ్లికి ఎందుకు అంగీకరించారు? ఒకవేళ వారు అంగీకరించింది నిజమే అయితే… పెళ్లి పందిరిపై అరటాకులు ఎండిపోక ముందే ఇంటికి తాళం ఎందుకు వేసినట్లు? స్థానికులకు నిజంగా పండన్న ఎక్కడికి వెళ్లిందనే విషయం తెలియదా? తెలిసీ దాచిపెడుతున్నారా? అనేవి సమాధానాలు లేని ప్రశ్నలుగా మారాయి. వీటిని సమాధానాలు దొరకాలంటే… పండన్న గానీ, పండన్న భార్యలు గానీ అక్కడికి రావాలి. లేదా… గ్రామస్థులు విషయం బయట పెట్టాలి. చూద్దాం అసలేం జరిగిందో మళ్లీ కొన్ని రోజుల తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Discussion about this post