ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. సచివాలయానికి వెళుతుండగా పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు. మెగా డీఎస్సీని ప్రకటించాలంటూ వైఎస్ షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో… ఉదయం నుంచి విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమెను హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
కాసేపు దీక్ష చేసిన షర్మిల ఆ తర్వాత కాంగ్రెస్ నేతలతో కలసి సెక్రటేరియట్ వైపునకు వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ షర్మిలతో పాటు కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, మస్తాన్ వలిలను అరెస్ట్ చేశారు. వీరిని దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. తాము సెక్రటేరియట్ కు వెళ్లి మెగా డీఎస్సీని ప్రకటించాలంటూ చీఫ్ సెక్రటరీకి వినతి పత్రాన్ని ఇస్తామని, తాము శాంతియుత పద్ధతుల్లో వెళుతున్నా పోలీసులు అడుగడుగునా అడ్డుకుని చివరకు తమను అరెస్ట్ చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. షర్మిల అరెస్ట్ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Discussion about this post