ఎన్నికల కోడ్ వెలువడే సమయానికి వైసీపీలో రెండోస్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి నెల్లూరు ఎంపీ బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా టీడీపీ నుంచి వేమిరెడ్డిపోటీలో ఉన్నారు. అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన విజయాసాయి రెడ్డి తన వాక్ చాతుర్యంతో విమర్శలను చాకచక్యంగా తిప్పికొడుతూ తనదైన స్టైల్లో రాజకీయం సాగిస్తున్నారు. నెల్లూరు నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చడంతోపాటు ఉపాధి అవకాశాలను పెంపొందిస్తానని, కార్గో ప్రాధాన్యం గల విమానాశ్రయం నిర్మిస్తానని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు.
విజయసాయికి పార్టీలో ఉన్నతస్థానం ఉన్నా.. భేషజానికి పోకుండా ఏడు నియోజకవర్గాలను తిరిగి పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు,నాయకులు వారి అనుచరులను కలసిరావడం పార్టీకి ప్లస్ గా మారింది. నెల్లూరుకు సమీపంలో ఉండే ముత్తుకూరు మండలంలోని తాళ్లపాడు గ్రామానికి చెందిన ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ అందరితో కలసి తిరిగారు. చంద్రబాబు పాలనలో కరవు కాటకాలను చవిచూసిన పరిస్థితిని పునరావృతాన్ని కోరుకోవద్దని సెంటిమెంటును పండిస్తున్నారు.
నెల్లూరు అసెంబ్లీ సెగ్మెట్ లో మైనార్టీ నాయకుడు ఖలీల్ కు టికెట్టు కేటాయించడం జగన్ ఔన్నత్యానికి నిదర్శనమంటూ అనుకూలాంశంగా మలిచే ప్రయత్నం సాగిస్తోన్నారు. మరోవైపు తెరవెనుక ప్రత్యర్థి కూటమికి చెందిన నాయకులను కలసుకొనే ప్రయత్నం ముమ్మరంగా సాగిస్తోన్నారు. తనవద్ద ఉన్న సామ, దాన , బేద దండోపాయాలతో పాటు ధన ప్రయోగాన్ని భారీగానే సాగిస్తోన్నారన్న వార్తలు వస్తున్నాయి. ఐప్యాక్ టీమ్ ఇప్పటికే సోషల్ మీడియా మార్గంలో ప్రతిఒక్క ఓటరును ట్రాక్ చేస్తోంది. స్వపక్షంలో రాజకీయ అనుభజ్ఞులను మరింత బలోపేతం చేయడం, ప్రత్యర్థివర్గం నాయకులకు ఎరవేయడం, కుదరక పోతే వారు అక్కడే ఉంటూ జోరు తగ్గించుకోవడం వంటి ఎత్తుగడలను కూడా ఆయన సాగిస్తున్నారు.
Discussion about this post