పరిమితి రూ.25 లక్షలకు పెంపు
ఆరోగ్యశ్రీ కవరేజీలో దేశంలోనే ఏపీ టాప్ గా నిలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను డిసెంబర్ 18న విడుదల చేయనుంది. 19 నుంచి 1.42 కోట్ల కుటుంబాలకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయనుంది.
దేశంలో 25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమే కావడం గమనార్హం. కొత్తగా తెస్తున్న మార్పులపై డిసెంబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, సీహెచ్‌వో, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లనుద్దేశించి సీఎం జగన్‌మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. మరోవైపు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా ఇంటివద్ద కోలుకుంటున్న రోగులకు ప్రభుత్వం ఐదువేల వరకూ సాయం అందిస్తోంది.
ఏపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల గుండె, కిడ్నీ, న్యూరో లాంటి పెద్ద జబ్బులకైనా చేతి నుంచి చిల్లి గవ్వ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 1,059 ప్రొసీజర్లు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉండగా వీటికి అదనంగా 2,198 ప్రొసీజర్లను చేర్చి మొత్తం 3,257 ప్రొసీజర్లతో పథకాన్ని అమలు చేస్తూ సీఎం జగన్ చరిత్ర సృష్టించారు.
ఆరోగ్యశ్రీ కింద గతంలో క్యాన్సర్ చికిత్సకు ఇచ్చే డబ్బులపై రూ.5 లక్షల వరకు పరిమితి ఉంది. తర్వాత ఎంత ఖర్చైనా రోగులే భరించాల్సి వచ్చేది. కానీ ఇకముందు ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. ఏపీ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆసరా కోసం ఏకంగా 13,168.96 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దేశంలోనే తొలిసారిగా కరోనాకు సంబంధించిన 10 రకాల చికిత్సలను 2021 మే, జూన్ నెలల్లో ఆరోగ్యశ్రీలో చేర్చింది. రెండు లక్షల మందికిపైగా కోవిడ్ బాధితుల చికిత్స కోసం 744 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
మరోవైపు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా 1,519 ప్రొసీజర్లకు సంబంధించి రోగి ఇంటివద్ద కోలుకుంటూ విశ్రాంతి తీసుకునే సమయంలో రోజుకు 225 రూపాయల చొప్పున నెలకు గరిష్టంగా ఐదు వేల రూపాయల వరకు ప్రభుత్వం అందిస్తోంది. రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజే బ్యాంకు ఖాతాలో ఆసరా మొత్తాన్ని జమ చేస్తున్నారు. డిశ్చార్జి అనంతరం ఏఎన్ఎంలు రోగుల ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ సేవల్లో ఏవైనా సమస్యలుంటే ఫిర్యాదు చేసేందుకు 104 కాల్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చారు.
Discussion about this post