అసలే ఎండాకాలం… ఎండలు మండుతున్నాయి. ఏపీలో రాజకీయం కూడా అంతే కాక పుట్టిస్తుంది. 2024 సాధారణ ఎన్నికల్లో నువ్వా – నేనా అన్నట్లు రెండు పక్షాల మధ్య రాజకీయ పోరు సాగుతుంది. అయితే ఏపీలోని మూడు శాసనసభ నియోజకవర్గాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీల అధినేతలు పోటీ చేస్తున్న ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై, గెలిచే అభ్యర్థికి వచ్చే మెజారిటీపై జోరుగా బెట్టింగ్ సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మూడు నియోజకవర్గాలేవి? ఎందుకని బెట్టింగ్ జోరుగా సాగుతుంది? వాచ్ దిస్ స్టోరీ…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇరు పక్షాలు ఎన్నికల్లో గెలుపుకోసం హోరాహోరీ తలపడుతున్నాయి. అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంటే… విపక్ష టీడీపీ మాత్రం బీజేపీ, జనసేనలతో జతకట్టింది. ఏపీలో రాజకీయాలు నిట్ట నిలువున రెండుగా చీలిపోయాయి. ఎన్నికల్లో ప్రత్యర్థిని ఓడించేందుకు, తాను గెలిచేందుకు వేయాల్సిన ఎత్తులన్నీ వేస్తున్నారు అభ్యర్థులు. అయితే ఏపీలోని ముగ్గురు నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు? ఎవరి ఎంత మెజారిటీ వస్తుంది? అని జోరుగా బెట్టింగ్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మూడు నియోజక వర్గాల్లో ఒకటి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గం కాగా, రెండోది ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గం. ఇక మూడోది… రసవత్తర పోరుకు వేదికైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల వియోజకవర్గంలో ఈ సారి ఎవరు గెలుస్తారు? వైఎస్ జగన్ గెలుపు సాధ్యమేనా? జగన్ మెజారిటీ ఎంత? లాంటి ప్రశ్నలతో ఏపీలో జోరుగా బెట్టింగులు కాస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. వాస్తవానికి పులివెందుల నియోజకవర్గం 1955లో ఏర్పడిన తర్వాత 2019 వరకు మొత్తం 16సార్లు ఎన్నికలు జరగ్గా, అందులో రెండు సార్లు ఉప ఎన్నిక జరిగింది. అయితే పులివెందుల ఎన్నికల్లో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టే గెలుస్తూ వస్తుంది. కేవలం 1962లో జరిగిన ఎన్నికల్లో మాత్రమే ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక వైఎస్ కుటుంబానిదే ఈ నియోజకవర్గంలో హవా అని ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. 1978లో మొదటి సారి పులివెందుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1978లో దేశవ్యాప్త ప్రభంజనంలోనూ జనతా పార్టీ ఇక్కడ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపన తర్వాత ఆ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ ఎప్పుడూ గెలిచిన పరిస్థితి లేదు.
Discussion about this post