హైదరాబాద్ రోడ్లన్నీ చార్మినార్ కు చేరుకుంటున్నాయి. రంజాన్ సందర్భంగా చార్మినార్ సెంటర్లో పగలు రాత్రి షాపింగ్ చేస్తున్న వారితో మహా బిజీగా ఉంది. హైదరాబాద్ వాసులు, పర్యాటకులు, బ్లాగర్లు, వాకర్లంతా అక్కడి చెత్తలో నడవాల్సి వస్తోంది. దీంతో అసలు మహానగరపాలక సంస్థ ఏం చేస్తోందన్న ప్రశ్న ప్రతిఒక్కరిలో తలెత్తుతోంది.
రాత్రి 11 గంటల సమయంలో అక్కడి జనసమూహం తగ్గితే శుభ్రపరచవచ్చని మున్సిపల్ సిబ్బంది పాతర్ ఘట్టి నడక దారిలో కూర్చొని చూస్తున్నారు. ప్రతి ఏడాది రంజాన్ కు షాపింగ్ చేసేవాళ్లను చూశాం కాని ఈ సారంత చెత్త ఎప్పుడూ లేదు. అందునా ప్లాస్టిక్ వ్యర్థాలు మరీ ఎక్కువగా ఉన్నాయని శానిటేషన్ సిబ్బంది, స్థానికులు చెప్పుకుంటున్నారు.
తెల్లవారు జామున 3 గంటలకు హాకర్లు, దుకాణాదారులు వెళ్లిపోతున్నారు. దీంతో జనసంచారం తగ్గుతోంది. అంతే రోడ్డంతా ప్యాకేజ్ మెటీరియళ్లు, ప్లాస్టిక్, వేస్టు చేసిన ఫుడ్, ఖాళీ చేసిన వాటర్ బాటిళ్లతో రోడ్లన్నీ నిండిపోతున్నాయి. అక్కడ రోడ్లన్నీ వ్యర్థ పదార్థాలు, నీళ్లతో ఉండి నడవడం కూడా చాలా డేంజర్ గా ఉంటోంది. ఎక్కడ కాలు జారి పడతామో అని భయం వేస్తుంది. కనుచూపుమేరలో ఎక్కడా డస్ట్ బిన్లు కానరావడం లేదు. వాస్తవానికి వారసత్వ ప్రదేశాల్లో ప్లాస్టిక్ లేదా ఎటువంటి చెత్తా చెదారాలు వేయకూడదు. అయితే అక్కడ ఉంటున్న హాకర్లే ఎక్కువ చెత్త వేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే గ్రేటర్ మున్సిపాలిటీ అక్కడ డస్టు బిన్లు ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు.
Discussion about this post