నా పేరు అరవింద్ కేజ్రీవాల్.. నేను టెర్రరిస్టును కాదు’’.. మద్యం కుంభకోణం కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ మేరకు ఓ సందేశం పంపారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. జైలులో ఉన్న ఆయనపై నిరంతర నిఘా కొనసాగుతుండడంతో కేజ్రీవాల్ ఈ విధంగా స్పందించారని ఆపార్టీ అంటోంది. కేజ్రీవాల్ పంపిన సందేశం గురించి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి కేజ్రీవాల్ అంటే ఎంత ద్వేషం ఉందో మరోసారి రుజువైందన్నారు. నిత్యం సీసీ కెమెరాల నిఘాలో పెట్టి కేజ్రీవాల్ ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? భార్య, కుటుంబసభ్యులతో ఏం మాట్లాడుతున్నారు? అని తెలుసుకుంటున్నారని మండిపడ్డారు. ఓ రాష్ట్ర సీఎం పట్ల ఇలాగేనా వ్యవహరించేదని ప్రశ్నించారు. కేజ్రీవాల్ సందేశంపై ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ స్పందించారు. తాము కేజ్రీవాల్‌ను టెర్రరిస్టు అనడం లేదని అవినీతిపరుడని మాత్రమే అంటున్నామని ఎద్దేవా చేశారు.
Discussion about this post