ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. ముందు చెప్పినట్టుగానే లోక్ సభ ఎన్నికల బరిలో కూడా నిలుస్తోంది. ఈ మేరకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసింది. ఎలాంటి హడావుడి లేకుండా.. కేవలం తన భర్త, కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి బర్రెలక్క.. నాగర్ కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన బర్రెలక్క.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.బర్రెలక్క చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. అయితే.. ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్లిన బర్రెలక్కకు.. కేవలం 5,598 ఓట్లు మాత్రమే పోలవటంతో.. నాలుగో స్థానానికి పరిమితమైంది.అయితే.. అసెంబ్లీలో ఓడిపోయినా సరే నిరుద్యోగుల తరపున తన పోరాటం ఆపనంటూ బర్రెలక్క ముందే ప్రకటించింది. తాను ఏ పార్టీలో చేరనని.. లోక్ సభ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ ప్రకటించింది. అప్పుడు చెప్పినట్టుగానే.. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. కాగా.. నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు.
Discussion about this post