దక్షిణ భారత దేశంలోని సుప్రసిద్దమైన నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ ఆలయం వసంత శోభను సంతరించుకుంది. సకల విద్యలకు నిలయమైన శ్రీ సరస్వతీ దేవి జన్మదినమైన వసంత పంచమి రోజున వేడుకల కోసం ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఈ నెల 14వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా వేకువ జామున గణపతి పూజ, అష్టోత్తర పూజ అనంతరం అక్షర శ్రీకార పూజలు ప్రారంభం కానున్నాయి. అయితే వసంత పంచమికి బాసర సరస్వతి ఆలయంలో భారీగా అక్షరాభ్యాస పూజలు జరుగుతాయి. అమ్మవారి జన్మనక్షత్రం రోజున పిల్లలచే అక్షర శ్రీకారం చేయిస్తే ఉన్నతంగా ఎదుగుతారని భక్తుల నమ్మకం. ఈసారి కూడా అక్షరాభ్యాస పూజల సందర్భంగా భక్తులకు ఏ ఇబ్బంది ఎదురుకాకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆలయంలో మూడు చోట్ల అక్షరాభ్యాస మండపాలను ఏర్పాటు చేశారు.
వసంత పంచమి రోజున ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఈసారి దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఉన్నారు. దీంతో మంత్రిని బాసరలో జరిగే వసంత పంచమి వేడుకలకు ఆహ్వానిస్తూ ఆలయ వ్యవస్థాపక చైర్మెన్ శరత్ పాఠక్, ఆలయ ఈఓ విజయ్ కుమార్ పురోహితులతో సహా మంత్రిని కలిసి పత్రికను కూడా అందజేశారు. మరోవైపు అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి సమర్పించేందుకు చీరను ఇక్కడే నేస్తున్నారు. వసంత పంచమి సందర్భంగా ఆలయంలో క్యూలైన్ల కోసం కర్రలతో బారికేడ్లను ఏర్పాటు చేశారు. అటు పోలీసు శాఖ కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
ఇదిలా ఉంటే సైకత విగ్రహం గా వేద వ్యాసుడు ప్రతిష్టించిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. మాఘ మాసంలో వచ్చే మాఘ శుద్ద పంచమిని వసంత పంచమిగా నిర్వహిస్తారు. సరస్వతి అమ్మవారి జన్మ దినమే ఈ వసంత పంచమి. ఈ వసంత పంచమినే శ్రీపంచమి, మదన పంచమి అని కూడా పిలుస్తారు. సుప్రభాత సేవతో సరస్వతి అమ్మవారి పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సరస్వతి అమ్మవారు ఈ క్షేత్రంలో మహాలక్ష్మీ, మహాకాళి సమేతంగా కొలువై ఉన్నారు. అయితే దేశంలో రెండే రెండు ప్రముఖ సరస్వతీ ఆలయాలు ఉండగా రెండవది బాసర సరస్వతీ దేవస్థానం కావడం విశేషం.
Discussion about this post