భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా దేశానికి అత్యధిక ఐసీసీ ట్రోఫీలు సాధించి పెట్టిన మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం కల్పించింది. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ అరుదైన గౌరవం ధోనీకి మాత్రమే దక్కటం విశేషం. ధోనీ ధరించిన ఏడో నెంబర్ జెర్సీకి బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించింది. దీంతో ఇకముందు భారత క్రికెటర్ ఎవరూ ఏడో నెంబర్ జెర్సీ ధరించడానికి వీలవదు. గతంలో సచిన్ ధరించిన పదో నెంబర్ జెర్సీ రిటైర్ అయినట్టు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ధోనీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే టీ 20 వరల్డ్ కప్ ఇండియాకు దక్కింది. తర్వాత వన్డే వరల్డ్ కప్, టీ 20 వరల్డ్ కప్ లను ధోని కెప్టెన్సీలోనే సాధించారు. ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ రికార్డ్ క్రియేట్ చేశాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌కే పరిమితం అయ్యాడు. భారత క్రికెట్ కు ధోనీ చేసిన సేవలకు గుర్తింపుగా బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకుంది.
భారత ఆటగాళ్లకు మొత్తం 60 జెర్సీ నెంబర్లను బీసీసీఐ కేటాయించగా కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు ఎంచుకోవడానికి ఇంకా 30 నెంబర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. కెరీర్ తొలినాళ్లలో పేసర్ శార్దుల్ ఠాకూర్ పదో నంబర్ జెర్సీని ధరించాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పదో నెంబర్ జెర్సీ రిటైర్ అవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏడో నెంబర్ జెర్సీ విషయంలో బోర్డు జాగ్రత్తపడింది. ఇకపై ఏడో నెంబర్ జెర్సీని ఎంపిక చేసుకోవద్దని ఆటగాళ్లకు సూచించింది.
Discussion about this post