ఆంధ్రా ఊటీగా పేరు పొందిన ఉద్ధానం ఇప్పుడు ఎలుగు బంట్లకు నిలయంగా మారింది. వీటి నుంచి ఎప్పుడు… ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని స్థానిక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. గత ఏడాదిలో పదుల సంఖ్యలో ఎలుగుల దాడిలో స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి ఇక్కడ నివసిస్తున్న స్థానికులకి శాశ్వత రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, తమకు వెంటనే రక్షణ కల్పించాలని ప్రజలు వేడుకుంటున్నారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు, పలాస, నందిగామ, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలాలను ఉద్ధానం ప్రాంతంగా పిలుస్తారు. ఈ మండలాలు సముద్ర తీర ప్రాంతంతో, చుట్టూ జీడి, కొబ్బరి, మామిడి తోటలతో పచ్చగా కళకళలాడుతుంటాయి. వేసవిలో ఈ ప్రాంతాన్ని ఊటితో పోలుస్తారు. సుదూర ప్రాంతాల్లో నివసించే స్థానికులు వేసవిలో ఇక్కడికి వచ్చి సేద తీరుతారు. ఇప్పుడు ఈ ప్రాంతం టూరిస్ట్ ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందింది. అయితే ఇదంతా ఒకప్పటి మాట…ఇప్పుడు ఇక్కడికి రావాలంటే తమ ప్రాణాలకు ఎలాంటి ముప్పు సంభవిస్తుందొ అని ఆందోళన చెందుతున్నారు.
ఉద్ధానం ప్రాంతంలో రైతులకు చెందిన తోటలను ఆనుకుని కొంత అటవీ ప్రాంతం ఉంది. సముద్ర తీర ప్రాంతంతో పాటు, కొండలు, గుట్టలతో ఉండే ఈ ప్రాంతంలో ఎలుగు బంట్లు సంచరిస్తూ ఉండేవి. అప్పట్లో ఇవి ఈ ప్రాంత ప్రజలకు వినోదాన్ని పంచేవి. క్రమేపీ వీటి సంఖ్య గణనీయంగా పెరగడంతో, వాటికి సరైన ఆహారం దొరకక గ్రామాల వైపు వస్తున్నాయి. జీడి, మామిడి, కొబ్బరి తోటలలో సంచరిస్తూ, వాటినే ఆవాసంగా చేసుకుంటున్నాయి. వీటితో తమ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ఈ ప్రాంత రైతులు చెబుతున్నారు.
Discussion about this post