కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క.. తెలంగాణ రాజకీయాల్లో పేరున్న నాయకుడు. తాజా ఎన్నికల్లో మధిర నుంచి ఘన విజయం సాధించారు. తెలంగాణ లో రేవంత్ రెడ్డి సారధ్యంలోని తొలి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎం బాధ్యతలు చెప్పట్టారు. అంతకుముందు 2009, 2014, 2018 ఎన్నికల్లో మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారాయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ముఖ్యమంత్రులైన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడిగా భట్టికి పేరుండేది. ఈ సాన్నిహిత్యం వల్లనే ఆయన కాంగ్రెస్ హయాంలో పలు కీలక పదవుల్లో కొనసాగారు.
భట్టి విక్రమార్క.. వైఎస్సార్‌ని రాజకీయ గురువుగా భావించేవారు.కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క.. 2007-09 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. 2009లో చీఫ్ విప్‌గా, 2011 జూన్ 4న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికై సేవలు అందించారు. సీనియర్ నేత బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన రెండో వ్యక్తిగా విక్రమార్క నిలిచారు. 2019 జనవరి 18న తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షనేతగా కూడా భట్టి విక్రమార్క ఎన్నికైనారు.
పార్టీలో ఆయన బలమైన దళిత నేత.భట్టి విక్రమార్క 2023 మార్చి 16న ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నుంచి ‘పీపుల్స్ మార్చ్’ పేరిట పాదయాత్ర ప్రారంభించి.. రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,360 కిలోమీటర్ల మేరకు నడిచారు. అడుగడుగునా ప్రజల సమస్యల గురించి భట్టి తెలుసుకున్నారు. అలాగే తన పాదయాత్ర ముగింపులో భాగంగా 2023 జులై 2న ఖమ్మం లో జనగర్జన సభను నిర్వహించారు. ఆ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
Discussion about this post