రుతుపవనాల రాకతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా ప్రకృతి రమణీయ ప్రదేశం చూడాలనుకునే వారికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భీముని జలపాతం ఓ చూడచక్కని ప్రదేశం అవుతుంది. 70 అడుగుల ఎత్తు నుండి జాలువారే జలాధార పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామంలో ఉన్న ఈ జలపాతానికి పంచ పాండవుల్లో ఒకరైన భీముని పేరు మీద ఆ పేరొచ్చింది. ప్రత్యేకించి ఈ జలపాతం వర్షాకాలంలో పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ జలపాతం చుట్టూ ఉన్న పచ్చని అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ఈ జలపాతానికి సమీపంలో పది కిలోమీటర్ల పొడవైన ఓ గుహ ఉంది. ఇది ఆ ప్రదేశానికి మరో అదనపు ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ గుహ ఇక్కడికి సమీపంలోని బల్లకొండ ఆలయం వరకూ ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. పూర్వం ఇక్కడ తపస్సు చేసే బుుషులు ఈ గుహ మార్గంలో ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించేవారట. ఈ జలపాతం దారిలో పచ్చని చెట్లు, చిన్న పిల్ల కాల్వలతో ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. భీముని జలపాతం సమీపంలో చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి.
రెండు గుట్టల మధ్య ఉండే ఈ ప్రాంతంలో యాదవులు ఎక్కువగా ఉండేవారని, అయితే, ప్రతి వేసవిలో వేడికి కాలిపోతున్న తమ నివాసాలను చూసి యాదవులు చేసిన ఆర్తనాదాలు విన్న భీముడు వారిని రక్షించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. భీముడు అడుగు వేయడంతో వచ్చిన నీటితో ఈ ప్రాంతం జలపాతంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. అలా భీముని పాదంగా ఈ ప్రదేశానికి పేరు వచ్చిందట.
ఇక ఇక్కడి సూర్యాస్తమయ దృష్యాలు తప్పకుండా చూసి తీరాల్సిందే. ఈ జలపాతం చూడటానికి చిన్నగా కనిపించినా, చుట్టూ ఉన్న సుందర అడవి పర్యాటకులను ఆకర్షిస్తోంది. భీమునిపాదం జలపాతం ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తోంది. అక్కడ భీముని పాద జలపాతపు సవ్వడులు తప్ప మరే శబ్దాలు వినిపించవు.
కొండల్లో నుంచి దూకే ఈ జలపాతం ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలను పర్యాటకులకు అందిస్తోంది. భీముని జలపాత సమీపంలో గుడిలో శివుడు, నాగదేవత విగ్రహలు ఉన్నాయి. నిత్యం ఇక్కడి స్థానికులు పూజలు చేస్తుంటారు. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఏ కాస్త వీలు చిక్కినా చుట్టుపక్కల గ్రామస్థులు ఇక్కడకు వచ్చి కాసేపు రిలాక్స్ అవుతుంటారు. మరికొందరేమో కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి వస్తుంటారు.
ఇక్కడి ప్రకృతి సౌందర్యం చూసి తరించడానికి వివిధ ప్రాంతాల నుండి ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ జలపాతాన్ని చేరుకోవడానికే అనేక మార్గాలున్నాయి. వరంగల్ నుంచి భీమునిపాదం చేరుకోవాలంటే సుమారు 55 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అక్కడి నుండి భూపతిపేట దగ్గర ఎడమవైపు తిరిగి, చిన్న ఎల్లాపురం మీదుగా భీముని పాదం చేరుకోవచ్చు. ఇక ఖమ్మం నుంచి అయితే సుమారు 88 కిలోమీటర్ల ప్రయాణించాల్సి ఉంటుంది. అదే హైదరాబాద్ నుంచి అయితే 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి.
ఈ జలపాతాన్ని చూసేందుకు వచ్చిన సందర్శకులు ఎలా ఉల్లాసంగా తమను తామే మైమరసిపోయి కాలం ప్రకృతితో మమేకమయ్యారో? జలపాతం వద్ద స్నానాలు చేస్తూ… ఫోటోలు దిగుతూ… ప్రకృతి దృశ్యాలను తమ చేతులో ఉన్న సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే… ఇక్కడ ఉండడానికి వసతుల్లేవు. వచ్చి చూసి వెళ్లిపోవాల్సిందే. మరెందుకు ఆలస్యం? ఈ సీజన్లో మీరూ భీముని పాదం జలపాతం చూసేందుకు రండి.
Discussion about this post