ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తిగా మారుతుంది. ప్రధాన పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేందుకు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీలో చేరికలు పెరుగుతున్నాయి. టిడిపి, జనసేన నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర రాయలసీమలో ముగింపు దశకు చేరుకుంది. నెల్లూరు జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశించే వేళ పార్టీలో కీలక చేరికలు మొదలయ్యాయి. తాజాగా నెల్లూరు జిల్లా కావలి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డి వైసీపీ లో చేరారు.దీంతో నెల్లూరు వైసీపీ కేడర్ లో జోష్ వచ్చింది.
మే 13 న రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచార హోరు కొనసాగిస్తున్నాయి..ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అందులోను నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. కావలి నియోజకవర్గంలో 2014,2019 ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీ ఘన విజయం సాధించింది. దీనిని బట్టి చూస్తే కావలి నియోజకవర్గంలో టీడీపీ కంటే వైసీపీ ఎంతో బలంగా ఉందని అర్ధమవుతుంది. ఈక్రమంలో ఈ సారి ఎలాగైన కావలిలో పట్టు సాధించి విజయబావుటా ఎగురవేయాలని టీడీపీ భావిస్తుంది. ఇటు వైసీపీ పార్టీ నియోజకవర్గంలో తమ అభ్యర్థి గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తుంది.. దీంతో కావలి అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది.
విష్ణువర్ధన్ రెడ్డి రాకతో కావలిలో వైసీపీ బలం రెట్టింపు అయిందని నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి వంటి నాయకులు వైసీపీలో చేరితే పార్టీ మరింత పటిష్టమవుతుందన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి మార్గదర్శకత్వంలో మరింత మంది వైసీపీలో చేనేందుకు సిద్ధమైయ్యారని తెలిపారు. విష్ణువర్ధన్ రెడ్డితో పాటు వేలది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందాన్ని ఇచ్చిందని విజయసాయిరెడ్డి వివరించారు.
Discussion about this post