చిన్నారి జాహ్నవి సేఫ్..? | Big Twist In Kakinada Jahnavi Missing Incident | 4sidestv

కన్నతల్లి ప్రేమానురాగాల నీడలో.. ఆ పచ్చని పల్లెటూరి ఒడిలో కిలకిల నవ్వుతూ తిరిగిన ఆ పసికూన ఇప్పుడు ఎక్కడుంది? కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక గ్రామం సాక్షిగా..

పసిప్రాయం కూడా దాటని ఆ చిరునవ్వుల మూట గత పన్నెండు రోజులుగా కనుచూపు మేరలో లేకుండా పోయింది. జాహ్నవి అనే ఆ అమాయక ప్రాణం అదృశ్యమై ఇన్ని రోజులవుతున్నా.. పట్టుమంటే అర కిలోమీటర్ కూడా లేని ఆ చిన్న పరిసరాలు నేటికీ ఒక ఛేదించలేని రహస్యంగానే మిగిలిపోయాయి.

ఒక్క గంట కంటికి కనపడకపోతేనే గుండె ఆగిపోయేంత తల్లడిల్లిపోయే కన్నప్రేమ.. పన్నెండు రోజులుగా కళ్ల ముందే నరకాన్ని చూస్తోంది. నా బిడ్డ క్షేమంగానే ఉందా, ఏ పొదల్లోనో ఎవరి బందీలోనో చిక్కుకుని భయంతో వణికిపోతోందా, అసలు ప్రాణాలతో ఉందా లేదా అన్న భయంకరమైన ప్రశ్నలు ఆ తల్లి గుండెను ప్రతిక్షణం రంపపు కోత కోస్తున్నాయి. ఆ కన్నతల్లి ఆవేదన, కన్నీటి ధారలు చూసేవారిని సైతం కలచివేస్తున్నాయి.

మొదటి రోజు పాప ఎక్కడో తప్పిపోయింది అనుకుని పోలీసులు, ఊరి జనం అంతా కలిసి ఆ చుట్టుపక్కల అన్వేషించారు. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ ఆ ఆశలు అడియాసలయ్యాయి. అత్యాధునిక డ్రోన్ కెమెరాలు ఆకాశంలో చక్కర్లు కొట్టినా, నిఘా నేత్రాలు ఊరంతా కాపలా కాసినా ఆ చిన్నారి జాడ మాత్రం దొరకలేదు. నాలుగో రోజుకు వచ్చేసరికి పాప అంత చిన్న వయసులో ఒంటరిగా వెళ్లే అవకాశం లేదని, ఇది ఖచ్చితంగా ఎవరో చేసిన ఘాతుకమేనని కన్నవారు కన్నీరుమున్నీరవడంతో పోలీసులు కేసును కిడ్నాప్ కోణంలోకి మార్చి దర్యాప్తు తీవ్రతరం చేశారు. అయితే వారం గడిచినా పాప వేసుకున్న బట్టల ఆనవాళ్లు కూడా లభించకపోవడంతో, స్థానిక అటవీ ప్రాంతంలో ఉండే కొండచిలువ లాంటి క్రూర జంతువులేమైనా దాడి చేశాయా అన్న భయంకరమైన అనుమానాలు వ్యక్తమై కన్నవారి గుండెల్లో మరింత ఆందోళన నింపాయి.

ఇక పది, పదకొండో రోజుల్లో జ్యోతిష్యుల మాటలతో పాప దొరుకుతుందన్న ఆశలు రేకెత్తడం, పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయడం వేగంగా జరిగిపోయాయి. చివరికి అడవి జంతువుల ఉనికిని కనిపెట్టేందుకు మాంసంతో కూడిన బొమ్మలను అమర్చి, కెమెరాలతో నిఘా పెట్టే వినూత్న ప్రయోగాలు కూడా చేశారు కానీ కాలం కరిగిపోతోందే తప్ప ఆ పసిపాప ఆచూకీ మాత్రం లభించలేదు. హేమాహేమీలైన అధికారులు, వందలాది మంది పోలీస్ సిబ్బంది, సరికొత్త టెక్నాలజీ.. అంతా కలిసి జల్లెడ పట్టినా ఆ కొద్దిపాటి పరిధిలోని మిస్టరీ తేలకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. విధి ఆడుతున్న ఈ వింత నాటకంలో, ఎక్కడో ఒకచోట తమ కన్నబిడ్డ క్షేమంగానే ఉంటుందన్న ఒకే ఒక్క నమ్మకంతో ఆ దేవుడిపైనే భారం వేసి కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు ఆ దురదృష్టకర తల్లిదండ్రులు.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top