హైదరాబాద్ వేదికగా బయో ఆసియా సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఈనెల 17వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈసారి రికార్డు స్థాయిలో 4,000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

హైదరాబాద్ వేదికగా ‘బయో ఆసియా 2026’ సదస్సు సన్నద్ధమవుతోంది. జీవశాస్త్రంలో వస్తున్న మార్పులు, లైఫ్ సైన్సెస్ రంగంలో నిరంతర వృద్ధిని సాధించడమే లక్ష్యంగా సదస్సులో కీలక చర్చలు నిర్వహించనున్నారు. హైటెక్స్‌లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సును ఈ నెల 17న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
4 వేల మంది ప్రతినిధులు…
ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ సమ్మేళనంగా బయో ఆసియా సదస్సుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈసారి నిర్వహించబోయే సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 4,000 మంది ప్రతినిధులు, 500 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొంటాయి. 2025లో నిర్వహించిన సదస్సుకు 3 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు.

2026 ఎడిషన్ సదస్సుకు సంబంధించి ‘టెక్‌బయో అన్‌లీష్డ్: ఏఐ, ఆటోమేషన్- బయాలజీ రివల్యూషన్’ అనే థీమ్‌తో దీన్ని నిర్వహించనున్నారు.ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, మెడ్ టెక్, డిజిటల్ హెల్త్ మరియు అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ లో 175 మంది ఎగ్జిబిటర్లతో భారీ ప్రదర్శన ఉంటుంది.
లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న సరికొత్త మార్పులు, శాస్త్ర పురోగతి, ఏఐ ప్రభావంపై ఈ సదస్సులో చర్చిస్తారు. హెల్త్‌కేర్ రంగంలో ఏఐతో వచ్చిన మార్పులు, లైఫ్ సైన్సెస్ భవిష్యత్తును నిర్దేశించే కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ బయో ఎకానమీని బలోపేతం చేయడం వంటి అంశాలపై ప్రసంగిస్తారు. హెల్త్‌కే ర్ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఈ సదస్సు ప్రధానంగా తెలంగాణకు ఉపయోగపడనుంది. పలు అంకుర సంస్థల ప్రాజెక్ట్ వివరాలను కూడా ఈ సదస్సులో ప్రదర్శించనున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన ప్రొఫెసర్ బ్రూస్ ఎల్.లెవిన్, అమ్జెన్ సంస్థ సీఎస్‌వో డాక్టర్ హోవర్డ్ వై.చాంగ్, జర్మనీకి చెందిన మిల్టెనీ బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ స్టెఫాన్ మిల్టెనీ, సానోఫీ సంస్థ ఈవీపీ మాడలీన్ రోచ్ వంటి ప్రముఖులు పలు చర్చల్లో పాల్గొంటారు. ఏఐ-ఆధారిత ఔషధ ఆవిష్కరణ, బయో మాన్యుఫ్యాక్చరింగ్ మరియు అధునాతన పద్ధతులపై చర్చిస్తారు.
Follow for more updates
