దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉండటంతో.. అన్ని పార్టీలు ఇప్పటికే సమయాత్తమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో తీరిక లేకుండా గడుతున్నాయి. ఇక కేంద్రంలో వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన బీజేపీ.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఈ మేరకు ఎన్నికలకు గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తోంది.
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ తరఫున లోక్సభకు పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు తుది దశకు చేరినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక చర్చలు కొనసాగించారు. దాదాపు 16 రాష్ట్రాల నుంచి లోక్ సభ అభ్యర్థుల పేర్లను చర్చించి ఖరారు చేసినట్లు సమాచారం. ఏ క్షణమైనా తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా వందకుపైగా స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కమలం పార్టీ నేడు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖరారైన అభ్యర్థుల జాబితాకు ప్రధాని మోదీ ఆమోదం తెలపనున్నారు. మోదీ ఆమోదం తర్వాత… ఏ సమయంలోనైనా తొలి జాబితాను విడుదల చేసే అవకాశాలున్నాయని తెలిసింది. తొలి జాబితాలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా మొత్తం 100 మంది పేర్లు ఉన్నట్లు, చాలా మంది సిట్టింగ్ ఎంపీలకే మళ్లీ టికెట్లు దక్కనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధించాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్రమోదీ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. బీజేపీ సొంతంగా 370 సీట్లు గెలుచుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బలహీనంగా ఉన్న స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దాదాపు 160 స్థానాల్లో బలహీనంగా ఉన్నట్టు బీజేపీ అధిష్ఠానం గుర్తించింది. ఈ సీట్లను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకునేందుకు మోదీ కొత్త వ్యూహాలను అమలుపరచనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Discussion about this post