మండి లోక్‌సభ నియోజకవర్గం … హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్నది. 2019 సాధారణ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఆభ్యర్ధీ రామ్ స్వరూప్ శర్మ మరణం తర్వాత 2021లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభా సింగ్ గెలుపొందారు. సినీ నటి కంగనా రౌనత్ ఈ స్థానం నుంచి బీజేపీ పార్టీ తరపున బరిలోకి దిగడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై కేంద్రీక్రతమైంది.
బియాస్ నది ఒడ్డున ఉన్న ఘాట్‌లు .. సమీపంలో ఉన్న శివుని ఆలయం విషయంలో వారణాసితో సారూప్యత ఉన్నందున మండిని “చోటీ కాశీ” అని కూడా పిలుస్తారు. గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు, ఆలయ నిర్మాణ వారసత్వం కారణంగా మండి ని హిమాచల్ ప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అంటారు. రాజకీయ ఉద్దండులు లోకసభకు ఎన్నికైన ఖ్యాతి ఈ నియోజకవర్గానికి ఉంది. ఇక్కడ కాంగ్రెస్,బీజేపీ బలమైన పార్టీలు. 1952 నుంచి కాంగ్రెస్ పదిసార్లు గెలిచింది .. 1977 లో జనతా పార్టీ గెలుపొందింది. 1989,1998,1999, 2014,2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.
ఈ సారి కంగనా రౌనత్ కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్యసింగ్ తో తలపడుతున్నారు. ఈ విక్రమాదిత్య సింగ్ ప్రస్తుతం సిమ్లా రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ..ఈయన హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ కుమారుడు… తల్లి ప్రతిభా సింగ్, ప్రస్తుత మండి లోక్‌సభ సభ్యురాలు.గతంలో కూడా ఆమె ఎంపీ గా చేశారు.అలాగే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా చేస్తున్నారు . వీరి కుటుంబం కాంగ్రెస్ కు విధేయంగా పనిచేస్తున్నది.
ఇక కంగనా విషయానికొస్తే .. ఆమె అసలు పేరు కంగనా అమర్‌దీప్ రనౌత్ .. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని చిన్న పట్టణమైన సూరజ్‌పూర్ రాజపుత్ర కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి ఆశా రనౌత్ పాఠశాల ఉపాధ్యాయురాలు .. తండ్రి అమర్‌దీప్ రనౌత్ వ్యాపారవేత్త. ఆమె ముత్తాత సర్జూ సింగ్ రనౌత్ గతంలో ఎమ్మెల్యేగా చేశారు. ఇక ఎంపీ గా గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు పూర్తి సమయం సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కంగనా రనౌత్ అంటున్నారు.
వివాదాస్పద తార గా ఖ్యాతి గాంచిన కంగనా రనౌత్‌ను సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు వివాదాలకు దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోదీని కంగనా రనౌత్ రాముడితో పోల్చినప్పుడు ఒక వివాదం చెలరేగింది.. అప్పటి నుంచి పార్టీ నేతలు ఆమెకు జాగ్రత్తలు తీసుకోమని సూచించారు . వన్‌లైన్ స్టేట్‌మెంట్‌లకు కట్టుబడి ఉండాలని.. మోడీ ప్రభుత్వం పనితీరు .. మహిళా సాధికారత వంటి సమస్యలపై దృష్టి పెట్టాలని ఆమెకు సలహా ఇచ్చారు.కంగనాను వివాదాల నుంచి కాపాడేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు.
Discussion about this post