సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే 37 ఏళ్ల లాస్య నందిత కన్నుమూశారు. ఫిబ్రవరి 23 తెల్లవారుజామున కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు పటాన్‌చెరు ఓఆర్‌ఆర్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె పీఏ ఆకాశ్, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఎమ్మెల్యే మృతదేహాన్ని పటాన్‌చెరు ఆస్పత్రికి తరలించారు.
పోస్ట్ మార్టం అనంతరం ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయాన్ని సికింద్రాబాద్, కార్ఖానా, కాకగూడలోని నివాసానికి తరలించి కార్యకర్తులు, అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత ఈస్ట్ మారేడిపల్లి స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.
ఆమె ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు.రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో లాస్య అంత్యక్రియలను జరుపుతామన్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే తీవ్రంగా గాయపడి ఆమె మరణించినట్లు పోలీసులు చెప్పారని.. ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ పెట్టుకోవాలన్నారాయన. కంటోన్మెంట్ లో లాస్య నందిత ఇచ్చిన హామీలను నెరవేరస్తామని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి.
వెంటాడిన మృత్యువు..
ఇటీవల ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. నల్గొండలో భారాస బహిరంగసభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఇంతలోనే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది డిసెంబర్‌లో సికింద్రాబాద్‌లో ఓ కార్యక్రమానికి వెళ్లిన లాస్య లిఫ్టులో ఇరుక్కుపోయిన సంగతి తెలిపిందే. ఓవర్‌లోడ్ కారణంగా లిఫ్ట్ కిందకి పడిపోవడంతో అందులో చిక్కుకుపోయారు. బీఆర్ ఎస్ ఎమ్మెల్యే, దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందగా, ఏడాది కాలంలోనే తండ్రి, కూతురు మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
1987లో హైదరాబాద్‌లో జన్మించిన లాస్య నందిత కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2016లో సాయన్నతోపాటు బీఆర్ ఎస్ లో చేరారు. 2016-20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేశారు. 2021 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థిపై 17 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..
నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి
లాస్య నందిత మృతిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందారని.. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం ఎంతో బాధాకరమన్నారు.
ప్రమాదం పై పోలీసుల దర్యాప్తు
పోలీసులు ఆమె మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 23 తెల్లవారుజామునే ప్రమాదం జరిగిందని.. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓవర్ స్పీడ్‌లో ఉందని తెలిపారు. ప్రమాదం తరువాత వంద స్పీడ్ వద్ద స్పీడో మీటర్ ఆగిపోయిందని చెప్పారు. కారు బ్యానెట్‌పై రెడీ మిక్స్ సిమెంట్ ఆనవాళ్లు ఉండటంతో.. రెడీమిక్స్ వాహనాన్ని ఢీకొట్టి అదుపుతప్పి ఓఆర్‌ఆర్ రెయిలింగ్‌కు బలంగా తాకి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం మొత్తం నుజ్జునుజ్జు అయిందన్నారు. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.
ప్రమాద స్థలంలో ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ను పోలీసులు పలు విషయాలపై ప్రశ్నలు సంధించి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. అయితే.. ‘ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలియదు.. నాకు అసలు గుర్తే లేదు’ అని డ్రైవర్ చెబుతున్నాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం డ్రైవర్‌కు ట్రీట్మెంట్ జరుగుతుండగా.. సాయంత్రం, రేపు ఉదయం మరోసారి విచారించాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టి చూస్తే.. డ్రైవర్ నిద్రమత్తే అతివేగానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనా వచ్చినట్లు తెలియవచ్చింది.
మరోవైపు కారు వేగంగా వెళ్తుండటంతో ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి రెయిలింగ్‌ను ఢీ కొట్టినట్లు కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కావడాన్ని బట్టి చూస్తే.. కచ్చితంగా ఏదో జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు బ్యానెట్ పైభాగం పూర్తిగా, ఎడమవైపు ఉన్న ముందు చక్రం సైతం ధ్వంసమైంది. నందిత కారు బ్యానెట్ పై భాగంలో అంటుకొని ఉన్న రెడీ మిక్స్ సిమెంట్ క్లూస్‌ను కూడా పోలీసులు సేకరించారు. మరీ ముఖ్యంగా.. ఔటర్ రింగ్ రోడ్డు రెయిలింగ్‌ను ఢీ కొడితే ఈ స్థాయిలో ప్రమాదం జరగకపోవచ్చని నిపుణులు అంటున్నారు. లాస్య నందిత మృతితో కార్ల రక్షణపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. లక్షలు పెట్టి కొన్న కార్లు చిన్న చిన్న ప్రమాదాలతో ప్రాణాలు పోతున్నాయని ఆవేదన నెటిజన్లు వెలిబుచ్చుతున్నారు
Discussion about this post