బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి..అనే సామెత ఊరికే రాలేదు. పది సంవత్సరాలు ఏకధాటిగా చక్రం తిప్పిన బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా డీలాపడిపోయింది. తెలంగాణ అంటే కేసీఆర్… కేసీఆర్ అంటే తెలంగాణ అనే విధంగా పేరు తెచ్చుకున్న ఆయన సైతం ప్రస్తుతం పార్టీ అస్తిత్వం కోసం పోరాడుతున్నాడు.
పార్లమెంట్ ఎలక్షన్స్ వేళ జిల్లాలలో అభ్యర్థులను నిలబెట్టేందుకే తలామునకలవుతున్నట్టు తెలుస్తోంది. 2014, 2019 ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ…తెలంగాణలో ప్రతిపక్షం అనే మాటకు విలువ లేకుండా చేసింది. నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా పాలన అందించింది. ఇంతటి స్థాయిలో ఎదిగిన ఈ పార్టీకి ప్రస్తుతం మనుగడ కరువవుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. బీఆర్ఎస్ పూర్తిగా చతికిల పడిపోయింది. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఎదిగిన నేతలు…పార్టీ కష్ట సమయంలో ఎప్పుడెప్పుడు జంప్ అవుదామా అని ఎదురు చూస్తున్నారు. పార్టీ నిర్వహిస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదనే చర్చ రాజకీయవర్గాల్లో నెలకొంది. ఇదే అదనుగా భావించిన బీజేపీ..బీఆర్ఎస్ స్థానాన్ని దక్కించుకోవాలనే ఆలోచనతో దూసుకెళ్తోంది. ఈ లోక్ సభ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో సీట్లు దక్కించుకోవాలని భావిస్తోంది.
2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 సీట్లలో గెలవగా… బిజెపి నాలుగు, కాంగ్రెస్ మూడు గెలిచింది. హైదరాబాదులో ఎంఐఎం విజయం సాధించింది. నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్, సికింద్రాబాద్ స్థానాలను బీజేపి కైవసం చేసుకుంది. ఈసారి మెజారిటీ ఎంపీ సీట్లు సాధించాలని భావిస్తున్న బీజేపి… 2019లో బీఆర్ఎస్ గెలిచిన సీట్లని తమవైపు మలుపుకునేలా వ్యూహాలు రచిస్తుందనె టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ కూడా… 15 ఎంపీ స్థానాలను గెలవాలని గట్టి ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య కీలక పోటీ ఏర్పడే అవకాశం కనిపిస్తోందని… బీఆర్ఎస్ మాత్రం అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Discussion about this post