గౌతమ బుద్ధుడు వైశాఖ మాసంలో శుక్ల పక్ష పూర్ణిమ రోజున జన్మించాడు. అందుకే బౌద్ధులంతా ఈ రోజును బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటారు. మౌర్య చక్రవర్తి అశోకుడు క్రీ.పూ. 249లో నిర్మించిన స్తంభంపై ఉన్న శాసనం ద్వారా, గౌతమ బుద్ధుడు 623 BCలో దక్షిణ నేపాల్లోని లుంబినీ ప్రాంతంలో రాజు శుద్ధోదన, మహా మాయాదేవి దంపతులకు జన్మించాడు. ఆయన బోధనలతోనే మన భూమి అఖండ భారతావని గా అవతరించింది. ఆ స్వర్ణ యుగం గురించి తెలుసుకుందాం…
రాకుమారుడైనప్పటికీ రాచరికం, ఐశ్వర్యం, సుఖభోగాలు వదిలి సామాన్యుడిలా మారి జ్ఞానం, దయ, సహనం, దయాళుత్వం, కనికరం గురించి గౌతమ బుద్దుడు బోధనలు చేశారు. అహింస ఆవశ్యకతను తెలియచేశారు. నేను చెప్పాననో, ప్రముఖులు చెప్పేరనో ఏదీ నమ్మకూడదు.. ప్రతి విషయం నువ్వే ప్రశ్నించుకొని, పరిశీలించి తెలుసుకోవాలన్నాడు. ఇదే మానవుల్లో విజ్ఞాన మార్గాన్ని ఆవిష్కరించింది. దీంతో బౌద్ధం మేధావుల మతంగా గుర్తించబడింది. బుద్ధుడు వెలువరించి బౌద్ధ ధర్మం నమ్మకాల మీద కాదు.. రుజువుగా నిలబడే సత్యం పై ఆధారపడింది. అంతే శాస్త్రీయమైంది కూడా. శాస్త్రీయత అంటే హేతువుకు నిలబడేది. పంచేద్రియ జ్ఞానానికి అందేది. దీనినే మనం ఈ రోజు విజ్ఞాన శాస్త్రం లేదా సైన్సు అంటున్నాం.. ఆయన బోధనలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన అశోక చక్రవర్తి సామ్రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ ను దాటి ఇండోనేషియా నుంచి రష్యాలోని సగ భాగం వరకు వ్యాపించి ఉంది. .అప్పటి భూ విస్తీర్ణం 56 లక్షల మైళ్లు. దీనినే మనం అఖండ భారత్ గా వ్యవహరిస్తున్నాం.. ప్రస్తుత భారతదేశ వైశాల్యం 32 లక్షల మైళ్లు. ఆయన రాజ్యంలో విద్యాసౌరభాలు విశ్వవ్యాప్తంగా పరిమళించాయి.
ప్రపంచానికి విశ్వవిద్యాలయం అనే పదం తెలియక ముందే క్రీస్తు పూర్వం 2000 ఏళ్లనాడే మన దేశం అనేక విశ్వవిద్యాలయాలతో విలసిల్లింది. నలంద, విక్రమశిల, ఓవంత పురి , తెల్హార, పుష్పగిరి విశ్వవిద్యాలయాలతోపాటు, వల్లభి, జగదల, సోంపూరా, సమ్య, ఉజ్జయిని, నవదీప్, తవాంగ్, కన్హేరి విశ్వవిద్యాలయాల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు చదువుకునే వారు. అప్పుడే ప్రపంచం ఈ దేశాన్ని విశ్వగురువుగా పిలిచింది. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల. ఇది క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో ప్రస్తుత పాకిస్థాన్ లో ఉండేది. 16 దేశాల నుంచి 10 వేల మంది పైగా విద్యార్థులు ఇక్కడ విద్యార్జన చేసేవారు. తర్కం, తత్వశాస్త్రం, ఖగోళం, కళలు, వైద్యం, ఆత్మరక్షణ వంటి 32 సబ్జెక్టులు బోధించేవారు. బుద్ధి విచక్షణతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధర్మ మార్గంలో ఈ సమాజంతో కలిసి నడవాలి. దుష్టులతో కలిసి నడవటం కంటే ఏకాకిగా ఉండటం ఎంతో మేలు. సంతోషంగా ఉండాలంటే నీ పరిస్థితిని మార్చుకోవాలి. స్వీయ నియంత్రణ కలిగి ఉండటమే నిజమైన బలం. సరియైన ఆలోచనలు చేయటమే పాండిత్యం. నీ ఆలోచనలతోనే నీ చుట్టూ ప్రపంచం ఏర్పడుతుందని విద్యార్థులకు బోధించేవారు. ప్రతి మనిషిలోనూ ప్రజ్ఞ అంటే జ్ఞానం, శీలం, ధ్యానం ఉండాలన్నది బౌద్ధ నియమం. బౌద్దంలో నమ్మకాలకు, మూఢత్వానికి చోటు లేదు. బుద్ధుని వైజ్ఞానిక మార్గం మంచి నడవడికకు, కుశుల కర్మలకు, సమసమాజ స్థాపనకు , మానవీయ ప్రపంచ నిర్మాణానికి ఒక శాస్త్రీయ ఆచరణాత్మక విధానం. మళ్లీ అక్కడికి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం..
Discussion about this post