ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న యువ ఆటగాళ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి వరాల జల్లు కురిపించింది. ప్రతిభను నిరూపించుకునే వారికి సముచిత స్థానం కల్పిస్తూ తాజా వార్షిక కాంట్రాక్ట్‌లలో పెద్దపీట వేసింది. అదే సమయంలో క్రమశిక్షణారాహిత్యం ప్రదర్శించిన ఆటగాళ్లను సహించేది లేదంటూ కొరడా ఝులిపించింది.
వార్షిక కాంట్రాక్ట్‌లలో ఈ సారి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ల పేర్లను పరిశీలించడం లేదని బోర్డు అధికారికంగా ప్రకటించింది. రంజీల్లో ఆడమని ఆదేశించినా వీరిద్దరు బేఖాతరు చేసినందుకు వల్లే ఇలా వేటు పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరి సంగతి ఇలా ఉంటే.. యువ సంచలనం, డబుల్ సెంచరీల వీరుడు యశస్వి జైస్వాల్ డబుల్ ప్రమోషన్ పొంది నేరుగా ‘బి’ గ్రేడ్ క్రాంటాక్ట్ దక్కించుకున్నాడు. అతడితో పాటు మరో పది మంది కొత్తగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు చేజిక్కించుకున్నారు. వారిలో వరుసగా రింకూ సింగ్, నంబూరి తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయి, ముకేశ్ కుమార్, ప్రసిద్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, రజత్ పాటిదార్, జితేశ్ శర్మ ఉన్నారు. వీరంతా ‘సి’ గ్రేడ్‌లో ఉండటం గమనార్హం. అంటే మ్యాచ్ ఫీజులతో పాటు రూ. కోటి వార్షిక వేతనం అందుకోనున్నారు.
Discussion about this post