ఈరోజు జరిగిన టి డి పి ,జనసేన మరియు బీజేపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం లో చాలా ఆసక్తికర ఘటనలు జరిగాయి ..అర్థవంతమైన ప్రసంగాలు జరిగాయి .నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నవారు చంద్రబాబు అంటూ ప్రసంగించిన పవన్ కళ్యాణ్ తాను కూడా అంతే పరిణతి తో మాట్లాడటం విశేషం అయితే అంతకంటే హుందాగా చంద్రబాబు ప్రవర్తించడం ,అంతే గొప్పగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం మరో విశేషం ..వాటి గురించి వివరాలు మనమిప్పుడు చూద్దాం ..
ఈరోజు జరిగిన టి డి పి ,జనసేన మరియు బీజేపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం లో పవన్ కళ్యాణ్ చాలా పరిణతి తో మాట్లాడారు ..గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి కలిసి కట్టుగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పారు. కూటమి శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించిన అనంతరం పవన్ మాట్లాడారు. అద్భుతమైన విజయం ఇది. కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా చూపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం అని ఇప్పటం సభలో చెప్పాం.. అదే మాటపై నిలబడ్డాం. ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం.. తగ్గాం.. ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. కక్ష సాధింపులకు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదు. మనందరం సమష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలి. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, శాంతి భద్రతల విషయంలో బలంగా నిలబడతామని చెప్పాం.
ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు కావాలి. నాలుగు దశాబ్దాల అనుభవం, అభివృద్ధిపై అపారమైన అవగాహన, పెట్టుబడులను తీసుకొచ్చే సమర్థత, ప్రతిభ, విదేశాల అధ్యక్షులను తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించే శక్తి ఉన్న చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి చాలా అవసరం. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను. అప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పడిన బాధను చూశాను. మంచిరోజులు వస్తాయి.. కన్నీళ్లు పెట్టొద్దని చెప్పాను. ఆ రోజులు వచ్చాయి. చంద్రబాబుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్నా.. అద్భుతమైన పాలన అందివ్వాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. ఈ సందర్భంగా పవన్‌ను చంద్రబాబు ఆలింగనం చేసుకుని ధన్యవాదాలు తెలిపారు.
తరువాత చంద్రబాబు మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో ఏపీలో దక్కిన విజయం దేశ చరిత్రలోనే లేదని, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వనటువంటి తీర్పును ప్రజలు ఇచ్చారని అన్నారు. ఈ మాండేట్ వల్ల ఢిల్లీలో తమను అందరూ గౌరవిస్తున్నారని వెల్లడించారు. 94లో వన్ సైడ్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలేదన్నారు. స్టైకింగ్ రేటు 93 శాతం రావడం అరుదైన అనుభవమని చెప్పారు.57శాతం ప్రజలు మనకు ఓట్లు వేసినందున మరింత బాధ్యతగా వ్యవహరించాలి. జనసేన 21 సీట్లు తీసుకుని 21సీట్లూ గెలిచాయి. బీజేపీ 10 సీట్లు తీసుకుని 8 గెలవడం మామూలు విషయం కాదు. జైల్లో నన్ను కలిశాక పొత్తు ప్రకటన తొలుత పవన్ కళ్యాణ్ చేశారు. ఆ రోజు నుంచీ ఎలాంటి పొరపచ్ఛాలు లేకుండా మూడు పార్టీలు కలిసేలా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. అధినేతలు కలిసి ప్రచారం చేయటం క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీకి మార్గం సుగమమైంద”ని చంద్రబాబు అన్నారు.
అంతేకాదు ఈ సమావేశానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఈ వేదికపై చంద్రబాబుకు అందరి కంటే పెద్ద కుర్చీని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చంద్రబాబు వేదిక పైకి వచ్చిన వెంటనే తనకు పెద్ద కుర్చీ వేయడాన్ని చూసి తీయించేశారు.అందరితో పాటే తానని.. అందరూ అక్కడ సమానమేనని ప్రత్యేక కుర్చీని తీసివేయించారు. ఆ వెంటనే నిర్వాహకులు మిగతా వారితో సమానంగా కుర్చీ వేశారు.
ఈరోజు జరిగిన కూటమి శాసనసభాపక్ష సమావేశంలో ఇంకొక అరుదైన ఘటన చోటుచేసుకుంది. 1995లో తొలిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 1995లో తెలుగుదేశం శాసనసభ పక్ష సమావేశంలో తొలిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రతిపాదించారు. 29ఏళ్ల తర్వాత జరిగిన కూటమి శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య దగ్గుబాటి పురంధేశ్వరి బలపర్చారు. ఈ సందర్భంగా 1995 నాటి పరిణామాలను టీడీపీ నేతలు గుర్తుసుకుంటున్నారు.
Discussion about this post