రాజులు, రాజ్యాలు కాలగమనంలో కలిసిపోయినా ఆనాటి రాచరికపు వైభవానికి చంద్రఘడ్ కోట ప్రతీకగా నిలుస్తోంది. సంస్థానాల జిల్లాగా పేరు గాంచిన పాలమూరు జిల్లాలో శత్రు దుర్భేద్యంగా నిర్మితమై, గత చరిత్రను చాటుతోన్న ఘనమైన కోట ‘చంద్రఘడ్’. కృష్ణానదికి 4 కి.మీ. దూరంలో ఎత్తయిన కొండపై ఈ కోట నిర్మితమైవుంది.. అమరచింత, వడ్డేమాన్ గ్రామాల నుంచి పన్నులు వసూలు చేసేందుకు రాజా తిమ్మారెడ్డి చంద్రసేన యాదవుడనే సైనికాధికారిని నియమించినట్లు, అతడే తన పేర ఈ చంద్రఘడ్ కోటను, తన భార్య పేరున ధర్మాపురం గ్రామాన్ని నిర్మించినట్లు చరిత్ర కారులు చెబుతున్నారు. ఐదు వందల అడుగుల ఎత్తున్న కొండపై ఈ కోట నిర్మాణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. చంద్రఘడ్ కోటపై మా 4 సైడ్స్ టీవీ మహబూబ్ నగర్ ప్రతినిధి చందు గ్రౌండ్ రిపోర్ట్.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. శతాబ్దాల క్రితం నిర్మితమైన చంద్రఘడ్ కోటకు సరైన గుర్తింపు లేక మరుగున పడిపోయింది. ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలకు ప్రాధాన్యతనిచ్చి సజీవ రూపం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలని ప్రజలు కోరుతున్నారు. శత్రువుల బారి నుండి రక్షించుకోవడానికి శత్రుదుర్గ్యమైన కోట గోడలు నిర్మించారు ప్రహరీ గోడలు చాలా ఎత్తుగా ఉండడంతో శత్రువులు లోనికి వచ్చే అవకాశం లేదు. కోట ప్రధాన ద్వారం నేటికీ చెక్కుచెదరలేదు ఇరువైపుల అరుగులు ఎత్తైన తలుపులు, కోట పై భాగంలో అక్కడక్కడ పిరంగుల కోసం పైన గదులు నిర్మించారు. శత్రువులు దాడికి వస్తే ప్రత్యేక దర్పణాలతో పసిగట్టి ఫిరంగుల ద్వారా మట్టికరిపించే నిర్మాణాలు ఉన్నాయి కోటపై నీటి ఎద్దడి తలెత్తకుండా 12 చలమలు తవ్వించారు రాయిపై నిర్మించిన ఈ చలమలలో నిత్యం నీరు ఉండటం ఇక్కడి ప్రత్యేకత.
రాతితో కట్టిన ఈ కోటపై నుంచి చుట్టుపక్కల మొత్తం పది కిలోమీటర్ల మేర పచ్చదనం పరచుకుంది. కోట లోపల చంద్రసేనుడు తన ఇష్టదైవమైన రామలింగేశ్వర స్వామి ఆలయం కట్టించాడు. ఈ కోటలో ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజున ఉత్సవాలు నిర్వహిస్తారు .ఇప్పటికీ నాగుల చవితి రోజు ఉత్సవాలలో భాగంగా కబడ్డీ పోటీలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యువకులు పాల్గొంటారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ చంద్రఘడ్ కోట పరిరక్షణ కోసం పర్యాటక శాఖ కానీ, పురావస్తు శాఖ కానీ దృష్టి సారించకపోవడం దురదృష్టకరం. చంద్రఘడ్ కోటకు చేరుకొనేందుకు సరైన రవాణా సౌకర్యం లేదు. ఎలాగోలా కష్టపడి ఇక్కడికి చేరుకున్న సందర్శకులకు ఈ ప్రాంతంలో నిలువ నీడలేకపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. సరైన పర్యవేక్షణ కొరవడటంతో గుప్తనిధుల కోసం కోటను ధ్వంసం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రఘడ్ కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని నాయకులు హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా ఇంకా ఆ దిశగా చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు
Discussion about this post