సీఐ నాగరాజు ఒక్కడే కాదు..ఆ ఇద్దరు ఎవరు? | CI Nagaraju Remand Report | Sai Krishna Missing Case

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ లాక‌ప్ డెత్ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజుకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

సాయికృష్ణ‌ది అదృశ్యం కేసు కాదని, పోలీసు కస్టడీలో జరిగిన మరణమ‌ని సిట్ స్పష్టం చేయ‌డంతో కోర్టు పై తీర్పు ఇచ్చింది. సిట్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను వెల్లడించింది. పోలీసులు మే 6న మార్కాపురం నుంచి సాయికృష్ణను అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారని, అక్కడ కస్టడీలో చిత్రహింసలవల్లే అతను మరణించాడని తెలిపింది. తన కొడుకు పోలీస్ స్టేషన్‌లో తీవ్రగాయాలతో, అపస్మారక స్థితిలో కనిపించాడని సాయికృష్ణ తల్లి చెప్పిన విషయాన్ని కూడా సిట్ ప్రస్తావించింది. లాకప్ డెత్‌ను కప్పిపుచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయని సిట్ పేర్కొన్న‌ది. మే 1 నుంచి జూన్ 1 వరకు పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను ఉద్దేశపూర్వకంగానే డిలీట్ చేశారని నివేదికలో స్పష్టంచేసింది.

అంతేకాకుండా సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేశారని, దాన్ని ఖననం లేదా దహనం చేసేందుకు ప్రయత్నించారని సిట్ తెలిపింది. ఇప్పటికీ మృతదేహం లభ్యం కాలేదని పేర్కొన్న‌ది. సీఐ నాగరాజు ఉద్దేశపూర్వకంగానే ఆధారాలను నాశనం చేసినట్టు తెలుస్తోందని సిట్ చెప్పింది. సీఐ నాగరాజు దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని, తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇస్తున్నారని సిట్ ఆరోపించింది. సాయికృష్ణను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించి, హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని కూడా రిపోర్టులో పేర్కొన్నారు. కాగా నిన్న 5 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నాగరాజును జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచగా జూలై 8 వరకు రిమాండ్‌కు తరలించారు. కేసు చాలా సంక్లిష్టంగా ఉందని, దర్యాప్తునకు మరింత సమయం అవసరమని సిట్ కోర్టుకు విన్నవించింది. కేసు దర్యాప్తు నేపథ్యంలో పోలీస్ శాఖ ఇప్పటికే సీఐ నాగరాజును విధుల నుంచి సస్పెండ్ చేసింది.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top