వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో తాజాగా 300 కిలోల బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్ చేయడంతో అందరి దృష్టి ఆ పట్టణంపై పడింది. నాలుగు బంగారం దుకాణాల్లో నాలుగు రోజులపాటు సోదాలు నిర్వహించిన అధికారులు బిల్లులు లేని బంగారాన్ని స్వాధీనం చేసుకుని తిరుపతికి తరలించారు. ఈ నేపధ్యం లో సిటీ అఫ్ గోల్డ్ గా.. సెకండ్ ముంబై గా ప్రసిద్ధి చెందిన ప్రొద్దుటూరు గురించి తెలుసుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది.
వైఎస్ఆర్ కడప జిల్లాలో పెన్నా నది ఒడ్డున ఉన్నప్రొద్దుటూరు మునిసిపాలిటీ 1915 లో ఏర్పాటైంది. జిల్లాలో రెండవ పెద్ద పట్టణమైన ఇక్కడ వందలాది బంగారం దుకాణాలు ఉన్నాయి. రోజూ వందల కోట్ల రూపాయలలో లావాదేవీలు జరుగుతాయి. అందుకే దీనికి సిటీ ఆఫ్ గోల్డ్.. సెకండ్ ముంబై అనే పేర్లు వచ్చాయి. బులియన్ మార్కెట్ లో బంగారం రేట్లను ప్రభావితం చేసేంత శక్తి ఇక్కడి వ్యాపారులకు ఉందని మార్కెట్ పండితులు చెబుతారు.
చెన్నై, బెంగళూరు, కోయంబత్తూరు తదితర నగరాల నుంచి ఎలాంటి పన్నులు చెల్లించకుండా కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలను పెద్ద ఎత్తున వ్యాపారులు ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తుంటారని, తద్వారా కోట్లు గడిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడికొచ్చి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి తీసుకువెళుతుంటారు.
ప్రొద్దుటూరులో బంగారం దుకాణాలతో పాటు వందల సంఖ్యలో వస్త్ర దుకాణాలు కూడా ఉన్నాయి. దసరా ఉత్సవాలను ఈ పట్టణంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ కారణంగానే ప్రొద్దుటూరును రెండవ మైసూర్ అని కూడా పిలుస్తారు. అత్యంత జనసాంద్రత కలిగిన మునిసిపాలిటీలలో ఒకటైన ఈ పట్టణ జనాభా రెండున్నర లక్షల పైనే ఉంది.
Discussion about this post