రేవంత్ రెడ్డి విమానానికి తప్పిన ముప్పు..!| CM Revanth Reddy Flight Diverted

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దారి మళ్లించారు. శంషాబాద్‌లో ఉరుములు, మెరుపులతో రెండు గంటలపాటు వర్షం బీభత్సం సృష్టించింది.

పెద్దఎత్తున ఈదురు గాలులు వీయడంతో ముందస్తు చర్యల్లో భాగంగా విమానాల ల్యాండింగ్‌కు అనుమతించలేదు. ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొని హైదరాబాద్‌కు రావాల్సిన సీఎం సాయంత్రం ఆరున్నర గంటలకు ఇండిగో విమానం ఎక్కారు. షెడ్యూల్‌ ప్రకారం రాత్రి 9 గంటల 15నిమిషాలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోవాలి. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా అధికారులు విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. సురక్షితంగా అక్కడికి చేరుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

హైదరాబాద్ నగరంలో రాత్రి కురిసిన భారీ వర్షం నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నగరాన్ని చుట్టుముట్టింది. ఈ అకస్మాత్తు వాన కారణంగా నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కార్యాలయాల నుండి ఇళ్లకు తిరుగుప్రయాణమైన ఉద్యోగులు, వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. వాతావరణ శాఖ ఇప్పటికే హైదరాబాద్, పరిసర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తీవ్రమైన వర్షపాతంతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఈ భారీ వర్షానికి నగరంలోని అనేక ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పురానాపూల్ శ్మశానవాటిక, ఉప్పల్, బోడుప్పల్, పంజాగుట్ట ఫ్లైఓవర్, ఎస్ఆర్ నగర్-బాల్కంపేట్ RUB, మెహదీపట్నం, అత్తాపూర్, కొండాపూర్, మియాపూర్, రాయదుర్గం మెట్రో స్టేషన్, గచ్చిబౌలి బయోడైవర్సిటీ వంటి ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు చేరింది. ముఖ్యంగా టోలిచౌకి – మెహదీపట్నం కారిడార్‌లో నీరు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదల్లేక గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 245 సమీపంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో భారీ వర్షం కారణంగా సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. హాల్‌లోకి నీరు చేరడంతో అక్కడ గందరగోళం నెలకొంది. వర్షాకాలంలో ఇలాంటి ఈవెంట్ వేదికల భద్రతా ప్రమాణాలపై ఈ ఘటన పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.

మరోపక్క రాత్రి ఎనిమిదున్నర నుంచి 11 గంటల మధ్య రాజేంద్రనగర్‌లో అత్యధికంగా 77.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఏక్తా కాలనీ, శాస్త్రిపురం, శివరాంపల్లి పరిసరాల్లో 59 మిల్లీమీటర్లు, మైలార్‌దేవ్‌పల్లి సబ్‌స్టేషన్ వద్ద 55.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, గోల్కొండ, బహదూర్‌పురా, బంజారాహిల్స్, మెహదీపట్నం ప్రాంతాలలో 40 నుంచి 48 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం రికార్డయింది. ఈ ఈదురుగాలుల బీభత్సానికి నగరంలో పలుచోట్ల చెట్లు, కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో భారీగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 లోని వెంగళరావు పార్క్ వద్ద ఒక భారీ వృక్షం కూలిపోవడంతో నిమ్స్ ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ స్తంభాలకు, నీటిలో మునిగిన వైర్లకు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలను హెచ్చరించారు.

భారీ వర్షం నేపథ్యంలో ‘హైడ్రా’తో పాటు DRF బృందాలు వెంటనే హై అలర్ట్ ప్రకటించి రంగంలోకి దిగాయి. రాత్రి 11:30 గంటల సమయానికి చెట్లు కూలినట్లు వచ్చిన 26 ఫిర్యాదులలో 21 చెట్లను అధికారులు విజయవంతంగా తొలగించారు. నిమ్స్ ఆసుపత్రికి విద్యుత్ పునరుద్ధరించడానికి వెంగళరావు పార్క్ వద్ద కూలిన చెట్టును వెంటనే తొలగించారు. మెహదీపట్నం, అత్తాపూర్ ప్రాంతాల్లో నిలిచిన నీటిని క్లియర్ చేశారు. అంతకుముందు కురిసిన వర్షాల తర్వాత కొండాపూర్, మియాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ముందస్తుగా చేపట్టిన పూడికతీత పనులు నీరు నిల్వ ఉండకుండా నిరోధించాయని హైడ్రా తెలిపింది. ప్రెస్టన్ ప్రైమ్ మాల్, ఖాజాగూడ చెరువు సమీపంలోని ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద చేసిన క్లీనప్ పనులు కూడా వరద నివారణకు తోడ్పడ్డాయి. అలాగే ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జ్‌పై నీరు సాఫీగా వెళ్లేందుకు రంధ్రాలలో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బంది తొలగించారు.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top