త్యాగధనులకు ఎంపీ టిక్కెట్లు !
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంటు ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకుగాను 16 స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ఒకరిద్దరికి మినహా మిగిలిన వారికి ఎంపీ టిక్కెట్లు ఇవ్వకూడదని అధిష్టానం నిర్ణయించినట్టు చెబుతున్నారు. అదే సమయంలో పార్టీ ప్రయోజనాల కోసం అసెంబ్లీ సీట్లు త్యాగం చేసిన నేతలకు మాత్రం కచ్చితంగా ఎంపీ టికెట్ ఇస్తారని తెలుస్తోంది.
మెజారిటీ లోక్ సభ సీట్లు హస్తగతం చేసుకునేందుకు వీలుగా బీఆర్ఎస్, బీజేపీ ముఖ్యనేతలను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలను కాంగ్రెస్ అగ్రనేతలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. 10 నుంచి 12 స్థానాల్లో ఎంపీ టికెట్ల ఖరారు సులభమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నల్లగొండ, భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, చేవెళ్ల, మల్కాజ్గిరి, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, మెదక్, జహీరాబాద్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పెద్ద కష్టమేమీ కాదని అంటున్నాయి. ఈ స్థానాల కోసం ఇప్పటికే రెండు చొప్పున పేర్లను పరిశీలిస్తున్నారని చెబుతున్నాయి.
నల్లగొండ నుంచి జానారెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డిలలో ఒకరు, భువనగిరి నుంచి కోమటిరెడ్డి లక్ష్మి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలలో ఒకరు, మహబూబ్‌నగర్ నుంచి వంశీచందర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డిలలో ఒకరు, చేవెళ్ల నుంచి కే.లక్ష్మారెడ్డి లేదంటే బీఆర్ఎస్ నుంచి వస్తారని భావిస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన ముఖ్య నేత, లేదంటే బీజేపీ నుంచి మరో కీలక నేత, మల్కాజ్‌గిరిలో మైనంపల్లి హనుమంతరావులను పోటీ చేయించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు చెబుతున్నారు.
పెద్దపల్లి నుంచి చెన్నూరు ఎమ్మెల్యే జి. వివేక్ కుమారుడు వంశీ లేదా పెరిక శ్యాం, ఖమ్మం నుంచి వి.హనుమంతరావు లేదంటే రేణుకా చౌదరి, పోట్ల నాగేశ్వరరావుల్లో ఒకరు, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, విజయాబాయిలలో ఒకరికి టికెట్ ఇవ్వొచ్చని అంటున్నారు. వరంగల్ నుంచి సిరిసిల్ల రాజయ్య, దొమ్మాట సాంబయ్య, అద్దంకి దయాకర్ పేర్లను, మెదక్ నుంచి జగ్గారెడ్డి లేదా విజయశాంతి, జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్ పేర్లను పరిశీలించవచ్చని చెబుతున్నారు.
ఆదిలాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఆయా స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్ నుంచి అజారుద్దీన్ లేదా ఫిరోజ్‌ఖాన్, సికింద్రాబాద్ నుంచి అనిల్‌కుమార్ యాదవ్ లేదా నవీన్ యాదవ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి సంజయ్ లేదా టి.జీవన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనుమడు రోహిత్‌రావు, పాడి ఉదయానందరెడ్డి, ఆదిలాబాద్ నుంచి నరేశ్ జాదవ్ లేదా మరో ఆదివాసీ నాయకుడి పేర్లు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
Discussion about this post