కుప్పం నియోజకవర్గం మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కు కంచుకోట లాంటిది ..ఈ నియోజక వర్గానికి చంద్రబాబు 35 ఏళ్ళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాస్తవానికి ఇది చంద్రబాబు సొంత నియోజకవర్గం కాదు. చంద్రగిరి ఆయన సొంత నియోజకవర్గం . 1978 లో కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడనుంచి గెలిచిన చంద్రబాబు… 1983 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకట్రామానాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత బాబు టీడీపీ లో చేరారు. 1985 ఎన్నికల్లో బాబు పోటీ చేయలేదు. తర్వాత చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం కు మారారు .
ఇక్కడ నుంచి ఏడు సార్లు గెలిచిన చంద్రబాబు కుప్పం కు గుడ్ బై చెబుతారని ప్రచారం జరుగుతోంది. నిజంగా బాబు నియోజకవర్గం మారుస్తున్నారా ? కుప్పం ఆయనకు అచ్చి రాలేదా ? ఆ విశేషాలేమిటో ఈ స్టోరీలో చూద్దాం.
1989 లో బాబు ఇక్కడ కేవలం 6918 ఓట్ల మెజారిటీ తో గెలిచారు. 1994 నాటికి ఆ మెజారిటీ 56588 ఓట్లకు చేరుకుంది. 1999 నాటికి ఆ మెజారిటీ 65687 ఓట్ల కు పెరిగింది. ఎప్పుడైతే నాటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుప్పం పై దృష్టి పెట్టారో అప్పటినుంచి మెజారిటీ తగ్గుతోంది.2004లో బాబు మెజారిటీ 59508 ఓట్లకే పరిమితమైంది. 2009 నాటికి మరికొంత తగ్గి 46066 ఓట్ల దగ్గర ఆగింది. దీంతో బాబు జాగ్రత్త పడ్డారు. పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. అయినప్పటికీ 2014 ఎన్నికల్లో మెజారిటీ పెద్దగా పెరగలేదు. 47121 ఓట్లను అధిగమించలేదు. 2019 ఎన్నికల్లో 70 వేల మెజారిటీ తో బాబును గెలిపించాలని ఆయన సతీమణి భువనేశ్వరి టెలి కాన్ఫెరెన్సులు పెట్టి నేతలను కోరారు. ఎన్నో తాయిలాలు ప్రకటించారు. అయినా వైసీపీ నేత జగన్ వేవ్ లో బాబు మెజారిటీ 29993 ఓట్లకే పరిమితమైంది. కౌంటింగ్ జరుగుతున్నపుడు ఒక దశలో బాబు ఓడిపోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. మెజారిటీ దాదాపు 17 వేలు తగ్గింది.
Discussion about this post