మాహుర్ ..మహారాష్ట్ర లో తెలంగాణ కు చెందిన ఆదిలాబాద్ పట్టణానికి దగ్గర్లో ఉన్న ఈ ప్రదేశం దత్త భక్తులకు , అమ్మవారి భక్తులకు ఎంతో మహిమాన్వితమైన స్థలం .మాహుర్ మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా లో వుంది.”శ్రీ గురు దత్తాత్రేయ చరిత్ర”లో మాహుర్ గురించి దాని ప్రాముఖ్యత గురించి విపులంగా చెప్పారు. దత్త పారాయణ చేసే భక్తులకు ఈ క్షేత్ర మహిమ గురించి ఎక్కువగా తెలుస్తుంది.మాహుర్ మాతృ పట్టణం, మయూర క్షేత్రం గా ప్రసిద్ది చెందింది. మాహుర్ పర్వత శ్రేణులలో మూడు కొండలపై మూడు అలయాలున్నాయి. ఒకటి దత్తాత్రేయస్వామి ఆలయం, రెండవది రేణుకామాత ఆలయం మరియు మూడవది అత్రి, అనసూయ మాతల ఆలయం.గురుచరిత్ర చదివిన వారికి ఈ మూడు ఆలయాలు ఇక్కడ ఎందుకు ఉన్నాయో అర్థమవుతుంది .
త్రిమూర్తు లైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి అవతరించిన దత్తాత్రేయుడు మాహుర్ ఘడ్ లో నిద్రించే వాడని ప్రసిద్ది. అత్రి, అనసూయల కుమారుడు దత్తాత్రేయుడు . దత్త అంటే దత్తత వెళ్ళడం. అత్త్రేయ అంటే అత్రి మహర్షి.
దత్తాత్రేయ అంటే అత్రి, అనసూయ మాతలకు దత్త పుత్రుడు . త్రిమూర్తులు ఈ దంపతులకు పుత్రుడి రూపం లో తమని తాము సమర్పించుకున్నారు కాబట్టి దత్తాత్రేయుడయ్యాడు. అనసూయా మాత పాతివ్రత్యానికి మెచ్చి త్రిమూర్తులు ఇచ్చిన వరం ప్రకారము త్రిమూర్తులు వారికి దుర్వాసుడు, చంద్రుడు, దత్తాత్రేయుడు అనే ముగ్గురు పుత్రులుగా జన్మిస్తారు.. దత్తాత్రేయుడు అంటే విష్ణు మూర్తి అవతారంగా భావిస్తారు. కొంత కాలం ముగ్గురూ అత్రి దంపతుల వద్ద పెరిగిన అనంతరం బ్రహ్మ అవతారమైన చంద్రుడు, శివుని అవతారమైన దూర్వాసుడు తమ అంశలను దత్తునిలో లీనం చేసి దుర్వాసుడు తపస్సుకు, చంద్రుడు తన స్థానానికి వెడలినపుడు దత్తాత్రేయుడు ఆ ముగ్గురి అంశలతో భాసిల్లాడు.
మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయులు అవతరించిన రోజు . దీనిని దత్త జయంతిగా జరుపుకుంటారు. దేవ్దేస్వర్ (Devdeswar) ఆలయం గా పిలువబడే దత్త మందిరం మాహుర్ లో వుంది. ఇది దత్తుడు నిద్రించే ప్రదేశం.గురుచరిత్రలో శ్రీ గురు దత్తాత్రేయుడు కాశీలోని గంగ లో స్నానం చేసి, కొల్హాపూర్ లో బిక్ష స్వీకరించి, మాహుర్ లో నిద్రించే వాడని చెప్పబడింది . ఇప్పటికీ దత్తుడు ప్రతి రోజు ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తాడని భక్తుల విశ్వాసం. మాతృ తీర్ధం లో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.
మరికొంత మంది దత్తాత్రేయుడు కొల్హాపురి లో బిక్ష తీసుకుని పంచలేశ్వర్ లో భోజనం చేసేవాడని, మాహుర్ లో విశ్రాంతి తీసుకునే వాడని కూడా అంటారు.
ఇక్కడ వున్న మాతృ తీర్థం దత్తాత్రేయుడిచే సృష్టించబడినదని పరశురాముడు తన తల్లితండ్రులైన జమదగ్ని, రేణుకల కర్మ కాండలు ఇక్కడ నిర్వహించాడని పురాణాలు చెబుతున్నాయి.
Discussion about this post