భారత క్రికెట్ లో ఒక్కో కెప్టెన్ దీ ఒక్కో శకం…అయితే మహేంద్రసింగ్ ధోనీది మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమైన శకమే.. ఎందుకంటే దేశానికి రెండు ప్రపంచకప్ లు సహా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన గొప్ప కెప్టెన్ అతడు… వరల్డ్ క్రికెట్ లో దాదాపు అన్ని దేశాల్లో ధోనీకి ఫ్యాన్స్ ఉన్నారంటే అతని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. వికెట్ల వెనుక ఉంటూ , బౌలర్లకు దిశానిర్థేశం చేస్తూ, యువక్రికెటర్లకు అవకాశాలిస్తూ తీవ్ర ఒత్తిడిలోనూ కూల్ గా ఉంటూ జట్టును విజయతీరాలకు చేర్చడం ఒక్క ధోనీకే చెల్లింది. ఒకటా , రెండా.. ధోనీ సారథ్యంలో భారత్ సాధించిన చారిత్రక విజయాలు చాలానే ఉన్నాయి. ధోనీ 43వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా భారత క్రికెట్ కు అతను అందించిన విజయాలను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి.. టీమిండియాను ప్రపంచ క్రికెట్లో మేటి జట్టుగా నిలిపిన కెప్టెన్. స్వదేశమైనా, విదేశమైనా జట్టును గెలిపించడమే అతడి లక్ష్యం. తీవ్ర ఒత్తిడిలో ధోనీ మైండ్ పాదరసంలా పనిచేస్తుంది. అందుకే అతన్ని మాజీ ఆటగాళ్ళు మాస్టర్ మైండ్ అంటూ పిలుస్తారు. ముఖ్యంగా యువఆటగాళ్ల నుంచి అద్భుత ప్రదర్శన రాబట్టడం, పరుగులు ఇచ్చినా బౌలర్లను వెన్నుతట్టి ప్రోత్సహించడం వంటివి ధోనీ కెప్టెన్సీలోనే చూశారు. ఎవ్వరూ ఊహించని విధంగా 2007లో భారత జట్టు పగ్గాలు అందుకున్న మహేంద్రుడు వెనుదిరిగి చూసుకోలేదు. తొలి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టెస్టుల్లో భారత్ ను నెంబర్ వన్ నిలపడం, ఆ తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్ అందించడం , అలాగే 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలోనూ జట్టును ఛాంపియన్ గా నిలపడం ఇలా చెప్పుకుంటే పోతే ధోనీ కెప్టెన్సీలో ఎన్నో మరపురాని విజయాలు వచ్చాయి. మూడు ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన తొలి కెప్టెన్ గా రికార్డు సృష్టించిన ధోనీ మైదానంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యంగానే ఉండేది. రిటైర్మెంట్ విషయంలోనూ ధోనీ తనదైన శైలిలోనే వ్యవహరించి అందరినీ షాక్ కు గురిచేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినా ఐపీఎల్ లో అభిమానులను అలరిస్తున్న మహేంద్రుడిని ఫ్యాన్స్ ముద్దుగా తలా అని పిలుస్తారు. చెన్నై సూపర్ కింగ్స్ ను ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలబెట్టిన ధోనీ 42 ఏళ్ళు దాటినా యువక్రికెటర్లతో పోటీపడుతున్నాడు. కాగా ఐపీఎల్ 17వ సీజన్ తో ఆటగాడిగా మహి కెరీర్ ముగిసిందన్న వార్తలు వచ్చినప్పటకీ… ఫ్యాన్స్ మాత్రం వచ్చే ఐపీఎల్ సీజన్ లోనూ ధోనీ ఆడాలని కోరుకుంటున్నారు. 18వ సీజన్ ఆడేందుకు ప్రయత్నిస్తానంటూ ధోనీ చెప్పడం ఫ్యాన్స్ లో జోష్ ను పెంచింది. మరి భారత క్రికెట్ లో అద్భుతాలు సృష్టించిన ధోనీకి 43వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా నెట్టింట ఫ్యాన్స్ హ్యాపీ బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
Discussion about this post