కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్లుగా తక్కువ సీట్లలో పోటీ చేస్తున్నది. అలాగే 1984 తర్వాత ఏ ఎన్నికలో కూడా మెజార్టీ మార్క్‌ను కాంగ్రెస్ పార్టీ సాధించలేదు.. అయినా కొన్నిసార్లు కూటమి లోని మిత్ర పక్షాలతో కలసి అధికారం చేపట్టింది .. ఆ కథా కమామీషు ఏమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం .
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్ల కాలంలో మోదీ- అమిత్ షా ద్వయం కాంగ్రెస్ పార్టీ ఇమేజిని క్రమంగా తగ్గించేశారు. 2024 ఎన్నికల్లో తక్కువ సీట్లలో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. కేవలం 328 సీట్లలోనే పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ సీట్లు తగ్గించుకోవడానికి కారణం పెద్ద రాష్ట్రాల్లో మిత్రపక్షాలకు న్యాయం చేయడం కోసమే అని ఆ పార్టీ నేతలు అంటున్నారు.ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహర్, తమిళనాడులో 201 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు మెజార్టీ సీట్లలో పోటీ చేస్తున్నాయి .. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ విధించుకుంది. ఆ క్రమంలో మిత్రపక్షాలకు ఎక్కువ సీట్లను కేటాయించింది.
1989-1999 మధ్య కాంగ్రెస్ పార్టీ 450 సీట్లలో బరిలోకి దిగింది. 2009లో కాంగ్రెస్ పార్టీ 440 సీట్లకు పోటీ చేసింది. 2014లో 464 సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది.2019లో కాంగ్రెస్ పార్టీ 421 స్థానాల్లో పోటీ చేసింది. 1984లో కాంగ్రెస్ పార్టీ 414 సీట్లు సాధించి అధికారం చేపట్టింది. 1989లో 197 సీట్లు గెలుచుకుంది. 1991లో 244 సీట్లలో విజయం సాధించింది. పీవీ నరసింహా రావు మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు నడిపించారు. 1996లో 140 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 1998లో 141 సీట్లలో విజయం సాధించింది. 1999లో 114 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2004లో 145 సీట్లలో జయకేతనం ఎగరేసింది. 2009లో 206 సీట్లు గెలిచి సత్తా చాటింది.
1984 తర్వాత ఏ ఎన్నికలో కూడా కాంగ్రెస్ మెజార్టీ మార్క్‌ను సాధించలేదు. 2014లో ఘోర పరాజయాన్ని చవి చూసింది .. కేవలం 44 సీట్లతో కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకుంది. 2019లో కూడా వరుస పరాజయమే .. 52 సీట్లకు పరిమితమైంది. గత 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ అంటే 272 కు చేరుకోలేక పోయింది. బీజేపీ నాలుగు దశాబ్దాల్లో ఎదిగింది. 2 సీట్ల నుంచి 303 సీట్లు సాధించింది.
భారతదేశ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ అతి తక్కువ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇండియా కూటమి సీట్ల షేరింగ్‌లో భాగంగా ఇతర పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకుని తాను తక్కువ స్థానాలకే పరిమితమైంది. ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం మొత్తం 543 ఎంపీ స్థానాలకు గానూ, కేవలం 328 స్థానాలకు పోటీ చేసింది . గత రెండు ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ ఈసారి కూటమిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది.
కాంగ్రెస్ పార్టీ 2019లో 421, 2014లో 464, 2009లో 440, 2004లో 417 స్థానాల్లో పోటీ చేసింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 328 సీట్లకు కాంగ్రెస్ పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి. కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ పార్టీ 432 సీట్లలో తమ అభ్యర్థులను నిలిపింది. గడిచిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. 2019లో 52 సీట్లు, 2014లో 44 సీట్లకు పరిమితమైంది. అంతకుముందు 2009లో 206, 2004లో 145 స్థానాలు గెలిచి యూపీఏ కూటమి నేతృత్వంలో అధికారాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఆలోచనతోనే, పొత్తు ధర్మాన్ని పాటించి తక్కువ సీట్లకు పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ సమర్ధించుకుంటోంది. దేశంలో పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కేవలం మైనర్ పార్టీగానే కాంగ్రెస్ పోటీ చేస్తోంది. ఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ సీట్లు దక్కాయి. ఎన్సీపీ-శివసేన… సమాజ్‌వాదీ తో పొత్తుకుదుర్చుకుని వారికి ఎక్కువ సీట్లు కేటాయించి.. కాంగ్రెస్ తక్కువ సీట్లకే పరిమితం అయింది.
ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 201 స్థానాలు ఉన్నాయి. అయితే, ఈ రాష్ట్రాల్లో మిత్రపక్షాలకే గణనీయమైన సీట్లు దక్కాయి. దీంతో కాంగ్రెస్ తక్కువ సీట్లకు పరిమితమైంది. మహారాష్ట్రలో 48 ఏంపీ స్థానాలకు గానూ కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇదే విధంగా యూపీలో 80 స్థానాలకు గాను 17, బీహార్‌లో 40 స్థానాలకు గాను 09, తమిళనాడులో 39 స్థానాలకు గాను 09 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్లో 42 స్థానాలకు గానూ 7 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. ఢిల్లీ, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన కూటమి భాగస్వామి ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఆరు సీట్లు వదులుకుంది… ఇలా సీట్లు తగ్గించుకుని మిత్రపక్షాలకు అవకాశం ఇవ్వడం మంచి పరిణామమే. కాంగ్రెస్ ఈ సారి 100-125 స్థానాల్లో సత్తా చాటుతుందని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. వాస్తవ ఫలితాలు ఎలాఉంటాయో ? వేచి చూడాలి.
Discussion about this post