తెలంగాణ బీజేపీకి చెందిన అగ్ర నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘనందనరావు, సోయం బాపూరావు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడం ఆ పార్టీ అధిష్టానానికి, రాజకీయ వర్గాలకు విస్మయం కలిగించింది. వీరిలో ముగ్గురు ఎంపీలు కాగా ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఎన్నికల్లో వీరి పరాజయాన్ని బీజేపీ నేతలు జీర్ణించు కోలేకపోతున్నారు. వీరి ఓటమికి కారణాలపై పోస్ట్ మార్టం చేస్తున్నారు.
కరీంనగర్ ఎంపీగా, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడిగా అత్యంత ప్రజాకర్షణ కలిగిన నేతల్లో బండి సంజయ్ ముఖ్యులు. రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరై, బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న స్థాయికి పార్టీ ఇమేజ్‌ని పెంచిన నేతగా బండి సంజయ్ గుర్తింపు పొందారు. ఆయన ఓటమికి ముస్లిం, మైనారిటీల ఓట్లు పడకపోవటమే కారణమని పార్టీ నేతల విశ్లేషణలో తేలింది. నియోజకవర్గంలో ఉన్న 62 ముస్లిం ఓటర్ల ప్రభావిత పోలింగ్ కేంద్రాల్లో అత్యధిక ఓట్లు ప్రత్యర్థి గంగుల కమలాకర్ కే పడ్డాయి. హుస్సేన్ పురాలోని 232 నుంచి 241 వరకు ఉన్న పోలింగ్ కేంద్రాల్లో 80 శాతానికిపైగా ముస్లిం ఓటర్లుండగా, వీటిలో పోలైన 6,764 ఓట్లలో సంజయ్‌కు కేవలం 259 మా త్రమే పడ్డాయి. ఈ బూత్‌లలో 4,979 ఓట్లు కమలాకర్‌కు పడ్డాయి. దీంతో సంజయ్ కి ఓటమి తప్పలేదు.
గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడిస్తానంటూ సవాల్ విసిరి ఈటల రాజేందర్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. తన సిట్టింగ్ స్థానం హుజూరాబాద్ లో కూడా ఆయన పోటీ చేసారు. రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొనడం ఈటలకు వ్యక్తిగతంగా నష్టం చేసిందని అంచనా వేస్తున్నారు. హుజూరాబాద్‌లో త్రిముఖ పోటీ వల్ల కాంగ్రెస్ అధిక ఓట్లు చీల్చడంతో ఈటల ఓటమి పాలయ్యారని పార్టీ నాయకులు విశ్లేస్తున్నారు.
నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవితపై గెలిచి సంచలనం సృష్టించిన ధర్మపురి అర్వింద్, ఫైర్‌బ్రాండ్ నేతగా గుర్తింపు పొంది దుబ్బాక ఉప ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులు చేసిన రఘునందన్‌రావు, ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న సోయం బాపూరావు ఓడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయన్నదానిపై పార్టీలో విస్తృతంగా చర్చ, విశ్లేషణ సాగుతోంది.
అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్ధే సీఎం అన్న బీజేపీ అధిష్టానం హామీ, మిగిలిన పార్టీల కన్నా అత్యధికంగా 36 సీట్లు బీసీలకు కేటాయించటం ఈ ఎన్నికల్లో అస్సలు ప్రభావం చూపలేదని పార్టీ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన ఎనిమిది మందిలో ముగ్గురు మాత్రమే బీసీలు ఉండటం, బీసీ సీఎం అభ్యర్థులుగా ముందున్న సంజయ్, ఈటల, అర్వింద్ ఓటమి పాలవడం దీనిని స్పష్టం చేస్తోందని అంటున్నారు.
Discussion about this post