ప్రశాంత వాతావరణంలో పిల్లలు చదువుకునేందుకు ఉల్లాసాన్ని కలిగించాల్సిన కళాశాల భవనం వారిని భయపెడుతూ అశాంతికి గురి చేస్తుంది. కళాశాల భవనం గురించి తెలిసిన వాళ్లయితే అక్కడ చేరేందుకు వెనుకాడుతున్నారు. తెలియని వారు మాత్రం అడ్మిషన్ తీసుకున్న తర్వాత కూడా పరిస్థితి అర్థమయ్యాక అక్కడి నుంచి జారుకుంటున్నారు. శిథిలా వస్థకు చేరిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం దుస్థితిపై ఫోర్ సైడ్స్ టీవీ అందిస్తోన్న ప్రత్యేక కథనం…
ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం. చూడండి ఎంతటి శిథిలావస్థలో ఉందో. అసలే పాలమూరు జిల్లా అంటేనే వెనుకబడిన జిల్లా… వసల కూలీల జిల్లాగా పేరు. అలాంటి జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంచాల్సిన ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమిటో ఈ కళాశాల భవనమే సాక్ష్యంగా నిలుస్తోంది. భావి భారత పౌరులు తయారు కావాల్సిన కళాశాల ప్రాంగణం పాలకుల పనితీరును ప్రశ్నిస్తోంది. ఈ కళాశాల భవనంలో భూతద్దం పెట్టి వెతికినప్పటికీ ఒక్క తరగతి గది కూడా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా కనిపించదు.
నాగర్ కర్నూల్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రస్తుతం 5వందలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ కళాశాల భవనాన్ని 1967లో నిర్మించారు. 1970లో ఇంటర్మీడియట్ విద్య ఇక్కడ ప్రారంభం అయింది. ఎంతో మంది విద్యావంతులను తయారు చేసిన నాగర్ కర్నూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. తరగతి గదుల గోడలన్నీ బీటలు వారాయి. గది పైకప్పు పెచ్చులు ఊడి పోతున్నాయి. రేకుల గదుల పరిస్థితి మరీ అద్వాన్నంగా తయారయింది. విరిగిపోయిన రేకుల గదుల్లోనే విద్యార్థులకు పాఠాలు సాగుతున్నాయి. ఇక్కడి పరిస్థితిపై విద్యార్థులు ఏమంటున్నారో మీరే వినండి.
చదువు కోవడానికి విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. కానీ తీరా ఈ కళాశాలకు వచ్చిన తర్వాత పరిస్థితి చూసి అక్కడ ఉండలేక టీసీలు తీసుకొని వెళ్లిపోతున్నారు. ఒకప్పుడు సుమారు రెండు వేల మంది వరకు విద్యార్థులకు ప్రతి ఏటా చదువుకునే వసతి కల్పించిన నాగర్ కర్నూల్ జూనియర్ కళాశాల భవనంలో ప్రస్తుతం 5వందల మంది విద్యార్థులే ఉన్నారంటే… అందుకు కారణం శిథిలావస్థకు చేరిన భవనమే. విద్యార్థులు రావడానికి సిద్దంగా ఉన్నప్పటికీ అందుకు తగిన సదుపాయాలు లేని కారణంగా కళాశాలకు దూరమైతున్నట్లు ఇటు విద్యార్థులు, అటు అద్యాపకులు చెబుతున్నారు.
26 తరగతి గదులు, 27 మంది అద్యాపకులు, 8 ల్యాబ్ లతో కొనసాగుతున్న నాగర్ కర్నూల్ జూనియర్ కళాశాల భవనంలో ఏ ఒక్క గది కూడా తరగతి గది వాతావరణాన్ని ప్రతిబింబించడం లేదు. పెచ్చులూడిపడి పలుసార్లు విద్యార్థులు గాయాల పాలవుతున్నారు. ఇక కోతులు, కొండెంగలు, కాకులతో కూడా విద్యార్థులకు, అద్యాపకులకు కొత్త సమస్యలు వస్తున్నాయి. రేకులకు రంద్రాలు పడటంతో కాకులు , ఇతర పక్షులు వాటిపై నుంచి వేసే చెత్త తరగతి గదుల్లో పడుతోందని అద్యాపకులు చెబుతున్నారు. వర్షం కురిస్తే పరిస్థితి మరీ అద్వాన్నంగా తయారవుతుందని విద్యార్థులంటున్నారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు బయట భోదిస్తుంటారు. అయితే వర్షం వస్తే వారి చదువులకు ఇబ్బంది తప్పడం లేదు. ఈ విషయాన్ని పలుసార్లు విద్యార్థులు, అద్యాపకులు, చివరకు కళాశాల ప్రిన్సిపల్ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కరిస్తామని చెబుతున్నవారే గానీ పరిష్కారం చేసిన వారు వారికి కనిపించడం లేదు. తెలుగు, ఇంగ్లీష్ మాథ్యమాల్లో 5వందల మంది విద్యార్థులకు ఉపయోగపడుతున్న ఈ భవనంలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ గ్రూపులతో పాటు ఆటోమోబైల్ టెక్నాలజీ, కస్ట్రక్షన్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, లైవ్ స్టాక్ మేనేజ్ మెంట్ లాంటి ఒకేషనల్ కోర్సులు కూడా నడుస్తున్నాయి.
ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. విద్యా శాఖ ఆయనే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో సదుపాయాల కోసం పెద్దపీట వేస్తానంటున్న సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్త భవనాన్ని నిర్మిస్తే కొత్తగా మరో రెండు, మూడు తరాల వరకు పేద విద్యార్థులకు మేలు జరుగే అవకాశం ఉంటుంది. ఆ దిశగా సీఎం చర్యలు తీసుకోవాలని ఫోర్ సైడ్స్ టీవీ విజ్ఞప్తి చేస్తోంది.
Discussion about this post