దేశంలో ఓటర్లు ఎంతమంది..? మనకు ఎంతశాతం ఓట్లు వస్తాయి..? మన పార్టీవారు వేరే పార్టీవారికి జారిపోకుండా కట్టు దిట్టం చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? మొదలయిన వన్నీ సరిగ్గా ఏదో ఒక ఎన్నికల సమయంలోనే చర్చకు వస్తుంటాయి. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో లేనివారికి ఆ హక్కు కల్పించే యత్నాలూ ముమ్మరంగా చేపడుతుంటారు. అయితే, ఏదో ఒక కేసులో జైళ్లలో మగ్గుతున్నారి సంగతేమిటి? ఖైదీలకు ఓటు హక్కు ఉంటుందా? అన్న ప్రశ్నలు కూడా ఈ సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్పన్నమవుతున్నాయి. మరి ఖైదీలకు ఓటు హక్కు ఉంటుందా? చట్టాలు ఏం చెబుతున్నాయి? లెట్స్ వాచ్.
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 62(5) ప్రకారం, జైలు శిక్ష లేదా పోలీసుల చట్టపరమైన కస్టడీలో జైలులో నిర్బంధించబడినట్లయితే, ఏ వ్యక్తి ఏ ఎన్నికల్లోనూ ఓటు వేయకూడదని పేర్కొంది. మానసిక వికలాంగులు లేదా కోర్టు ద్వారా మానసిక వికలాంగులుగా పరిగణించిన వారు తమను తాము ఓటరు జాబితాలో నమోదు చేసుకోలేరు. అందుకే వీరికి ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయబడవు. ఈ వర్గానికి చెందిన ప్రజలు కూడా ఓటు వేయలేరు.
కారాగారంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఓటు వేయడానికి అనుమతిస్తే భారీ భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. తద్వారా ఎన్నికలకు నిర్వహణ కష్టంగా మారుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. నేరం చేసిన వ్యక్తి.. శిక్షాస్మృతి ప్రకారం కొన్ని స్వేచ్ఛలను కోల్పోవాల్సి వస్తుంది. దీంతో జైలులో ఉన్న వ్యక్తి బయట ఉన్న పౌరులతో సమాన హక్కులను పొందే అవకాశాన్ని కోల్పోతాడు. ఆ ప్రాతిపదికనే ఓటు హక్కునూ కోల్పోతాడని న్యాయనిపుణులు చెబుతున్నారు.
ఖైదీలకు ఓటు హక్కు కల్పించాలన్న సూచన ఈనాటిది కాదు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే ఆ అంశంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నదైనా, పెద్దదైనా నేరం నేరమే. కాబట్టి హత్యలు, లైంగిక దాడులు చేసిన వారితోపాటు చిన్న చిన్న నేరాలు చేసిన వారికీ ఓటు హక్కు తొలగించారు. కానీ జైల్లో ఉన్న వ్యక్తి పౌరసత్వం రద్దవదు. మరి వాళ్లకు ఓటింగ్ హక్కు ఎందుకు తీసేయాలి? ఇలాంటి తేడాల వల్ల సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారిపై ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కానీ ఓటేయలేకపోవడం విచిత్ర మంటున్నారు. దీన్ని బట్టి జైళ్లలో ఉన్నోళ్ల నేరం రుజువు కాకున్నా తక్కువ స్థాయి సిటిజన్లు అవుతున్నారని చెబుతున్నారు.
Discussion about this post