ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్.. ఇప్పుడు దేశంలో సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో.. ప్రపంచదేశాలు కూడా ఈ అంశంపై స్పందిస్తున్నాయి. కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా కూడా తన స్పందనను తెలియజేసిందంటే… ఈ లిక్కర్ పాలసీ ప్రకంపణలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత వివాదాస్పద లిక్కర్ పాలసీని ఎవరు రూపొందించారు? ఎవరు పాలసీని సిద్ధం చేసి ఢిల్లీ ప్రభుత్వానికి అందించారు..? సూత్రదారులను పట్టుకున్నారు సరే…! మరి లిక్కర్ స్కామ్ వెనుకున్న అధికారులను ఎందుకు పట్టుకోలేదు..? లెట్స్ వాచ్..
గతంలో ఆబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శిగా చేసిన ఈయన పేరు తెలంగాణ ప్రజలకు సుపరిచితమే..! కేసీఆర్ ఏలుబడిలో ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రంలో చక్రం తిప్పారు. ఆయన లేకుండా రాష్ట్రంలో ఏ ప్రభుత్వ కార్యక్రమం ముందుకు సాగేది కాదంటే అతిశయోక్తి కాదు.. దీనిని బట్టి ఆయన ప్రభావం ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. రైతుబంధు దగ్గర నుంచి వివాదాలకు కేంద్ర బిందువైన ధరణి పోర్టల్ వరకు అన్ని పాలసీలు ఆయన కనుసన్నల్లో రూపుదిద్దుకున్నవే..! అలా ఆ ప్రముఖుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు.
అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ వెనుక ఉన్నది కూడా ఆయనే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కల్వకుంట్ల కవిత కోరిక మేరకు … అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో ఆయన ఈ పాలసీని సిద్ధం చేశారని టాక్ నడుస్తోంది. అప్పటి వరకు ఉన్న పాలసీని మార్చాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే.. కవితతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖలకు లబ్ది చేకూర్చే విధంగా పాలసీని ఆయన సిద్ధం చేసి ఇచ్చారన్న ప్రచారం నడుస్తోంది.
ఈ పాలసీ రూపొందించడంలో తెలంగాణకు చెందిన మరికొందరు అధికారులు కూడా భాగస్వామ్యం అయ్యారని తెలుస్తోంది. అప్పటి కేసీఆర్ కోటరీలోని జాయింట్ సెక్రెటరీగా పనిచేసిన మరో వ్యక్తి కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించడంలో సహకారం అందించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మరో వ్యక్తి ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించడంలో కీలక భూమిక పోషించినట్లు సీఎంవోలో అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. అయితే ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి ఆదేశాల మేరకే పైన చెప్పుకున్న మరో వ్యక్తి ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో సహకారం అందించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎక్సైజ్ శాఖపై అవగాహన ఉన్న అధికారులు కావడంతో.. వీరిద్దరికి కేసీఆర్ ఈ బాధ్యతలు అప్పగించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
సీఎస్ గా చేసిన ప్రముఖ వ్యక్తి సారధ్యంలో రూపుదిద్దుకున్న ఈ మద్యం పాలసీ.. కవిత ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి చేరింది. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం 2021 నవంబర్‌లో ఈ లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ప్రకారం మద్యం రిటైల్ అమ్మకాల నుంచి ప్రభుత్వం వైదొలిగి లైసెన్స్ కలిగిన ప్రయివేట్ వ్యక్తులకు లిక్కర్ స్టోర్లను నడిపేందుకు అవకాశం ఉంటుంది. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడానికి, ప్రభుత్వ ఆదాయం పెంచడానికి, కస్టమర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండటం కోసం నూతన మద్యం విధానం ఉపయోగపడుతుందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఈ పాలసీ ప్రకారం లిక్కర్ షాపులు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచొచ్చు. లిక్కర్ స్టోర్లు అందించే డిస్కౌంట్లు, డీల్స్ కారణంగా మద్యం అమ్మకాలు పెరిగాయి. దీంతో ప్రభుత్వ ఆదాయం 27 శాతం పెరిగింది. అయితే నూతన మద్యం విధానంలో నిబంధనలను ఉల్లంఘించారని అప్పట్లో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. లైసెన్స్ పొందిన కొందరికి లబ్ధి చేకూర్చారని ఆయన తన నివేదికలో చెప్పారు. కోవిడ్ సమయంలో లిక్కర్ లైసెన్స్ ఫీజుపై 144 కోట్ల రాయితీ ఇచ్చారని ఆయన తెలిపారు. పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేలా మద్యం పాలసీని కవిత సూచనల మేరకు తెలంగాణ ప్రముఖ వ్యక్తులు రూపొందించారని సమాచారం.
1995 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆ ప్రముఖ వ్యక్తి .. తెలంగాణలో దాదాపు ఐదేళ్ల పాటు ఆబ్కారీశాఖలో ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఈ ప్రముఖుని కేటాయింపును 2023 జనవరి 10న హైకోర్టు రద్దు చేసింది. ఆయనను తెలంగాణ క్యాడర్ నుండి రిలీవ్ చేసి జనవరి 12 లోపు ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో చేరాలని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 2019 నుంచి 2023 పని చేసిన తర్వాత కోర్టు ఆదేశాలతో… ఈ ప్రముఖుడు జనవరి 12న ఏపీలో రిపోర్టు చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ను కూడా కలిశారు. ఏపీలో రిపోర్టు చేసిన నెల రోజుల తర్వాత కూడా… ఆయనకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలూ అప్పగించలేదు. దీంతో తన పదవీ కాలం ముగియక ముందే స్వచ్ఛంద విరమణ చేశారు. ఆయన వాలంటరీ రిటైర్మెంట్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదించారు.
వాస్తవానికి ఈ ప్రముఖుడు తెలంగాణ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం.. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల విభజనను కూడా పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఈ ప్రముఖున్ని సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందిగా కేంద్రం స్పష్టం చేసింది. అయితే, తనను ఏపీకీ కేటాయించడంపై ఆయన కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. దాంతో ఆయన సేవలు తెలంగాణ రాష్ట్రానికి అవసరమని భావిస్తే ఆంధ్రా అనుమతితో డిప్యూటేషన్‌పై కొనసాగించుకోవాలని క్యాట్ సూచించింది. ఇలా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని కంటిన్యూ చేయడానికి ఏపీకి వెళ్లేందుకు విముఖత చూపించిన ఆయన తెలంగాణలోనే అధికారాలు చెలాయించారు.
సీఎస్ కంటే ముందు ఆబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. దీంతో మద్యం పాలసీ రూపకల్పనను కేసీఆర్ ఆయనకే అప్పగించారు. అలా ఢిల్లీ మద్యం పాలసీని కూడా కేసీఆర్ ఆయనతోనే ప్రిపేర్ చేయించారని తెలుస్తోంది. తెలంగాణ ఆబ్కారీ శాఖలో ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉండటం, తెలంగాణ మద్యం పాలసీ మొత్తం ఆయన కనుసన్నల్లోనే రూపుదిద్దుకోవడంతో పాటు మద్యం ఆదాయం ఎలా పెంచాలి.? పాలసీ ఎలా రూపొందిస్తే అధికార పార్టీకి చెందిన వ్యక్తులకు లబ్ది చేకూరుతుంది? అన్న అంశంలో ఆయనది అందెవేసిన చేయి కావడంతో.. ఢిల్లీ మద్యం పాలసీని కూడా కేసీఆర్ సూచనల మేరకు.. కవిత ఆలోచనలకు అనుగుణంగా ఆయన సిద్ధం చేశారు.
పాలసీ రూపకర్త ఆయనే అయితే దర్యాప్తు సంస్థలు ఆయన్ను ఎందుకు విచారించడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయన బిహార్ కు చెందిన వ్యక్తి కావడంతో బిహార్ నుంచి ఢిల్లీలో దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మెజార్టీ ఐఏఎస్ అధికారులు బిహార్ కు చెందిన వారే ఉంటారు. దీంతో తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అసలు తన పేరు బయటకు రాకుండా ఆయన దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేశారన్న చర్చ జోరుగా సాగుతోంది. అందుకే ఈ కేసులో సీఎం స్థాయి వ్యక్తులను అరెస్టు చేసినా… ఆయన పేరు బయటకు రాకపోవడం వెనుక పెద్ద తతంగమే జరిగినట్లు.. తెరవెనుక పెద్ద కథే నడిచినట్లు తెలుస్తోంది.
సూత్రదారులు ఆప్ ప్రభుత్వ పెద్దలు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలే అయినా… రూపకర్త మాత్రం ఆయనే అన్న ఆరోపణలో నేపథ్యంలో ఆ ప్రముఖునిపై దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్న ఉత్కంఠ నెలకొంది. మరి కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు ఆయనపై చర్యలు తీసుకుంటాయో? లేదో చూడాలి.
Discussion about this post