దేశంలో ఇప్పుడు ఎన్నికల మ్యానియా నడుస్తోంది.. మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరుతాయి. యువకుల నుంచి వృద్ధుల వరకు ఓటు హక్కు వినియోగించుకుంటారు.. అయితే ఓటు వేసిన తర్వాత సిబ్బంది ఎడమచేతి వేలి గోటికి సిరా గుర్తు వేస్తారు. ఇదే ఓటు వేశామనడానికి గుర్తు… ఇంతకీ ఈ ఇంక్ గుర్తు ఎప్పటి నుంచి వేస్తున్నారు.. దాని వెనక ఉన్న కథేంటి.. ఈ సిరా ఎవరు ఉత్పత్తి చేస్తారు.. ఎన్ని రోజుల వరకు వేలిపై ఇంక్ గుర్తు చెదిరిపోకుండా ఉంటుంది.. ఆ విశేషాలు మీ కోసం…!
మన దేశంలో 1962లో ఈ ఇంక్ గుర్తును మొదటిసారిగా వాడారు. అప్పటి లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ బూత్‌లో ఓట్లు వేసిన ఓటర్లకు సిరా గుర్తు వేశారు. అప్పటి నుంచి కర్ణాటక ప్రభుత్వ సంస్థ మైసూర్ పెయింట్స్ దీన్ని సరఫరా చేస్తోంది.. ఇది కేవలం భారత దేశానికే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 30 పై చిలుకు దేశాల్లో మైసూర్ పెయింట్స్ వాళ్లు తయారు చేసిన ఇంక్ డబ్బాలను సప్లై చేస్తున్నారు.
ఓటేసినట్లు తెలియడానికి ఓటరు ఎడమ చూపుడు వేలిపై సిరా గుర్తు పెడతారు. చూపుడు వేలు లేకుంటే ఎడమ చేతిలోని ఇతర వేలిపై వేస్తారు. ఎడమ చేయిలేకుంటే కుడిచేతి వేళ్లలో దేనికైనా వేస్తారు. రెండు చేతులు లేకుంటే ఎడమ లేదా కుడి చేయి చివరి భాగాలకు సిరా గుర్తును వేస్తారు. ఇక సిరాలో సిల్వర్ నైట్రేట్ అనే రసాయనాన్ని కలుపుతారు. ఇది కలపడం వల్ల ఈ సిరా గుర్తు త్వరగా చెదిరి పోదు.. వేలి గోటిపై వారం కంటే ఎక్కువ కాలం ఇది అలాగే ఉంటుంది. ఈ గుర్తు వేయడం వల్ల దొంగ ఓట్లను నియంత్రించే అవకాశం ఉంటుందనే భావించి ఈ పద్ధతిని ప్రవేశ పెట్టారు. ఈ గుర్తును చర్మంపైన వేస్తే మాత్రం మూడు రోజుల మాత్రమే ఉంటుందని తెలుస్తోంది.
పోలింగ్ బూత్‌లో వాడే ఇంక్ బాటిల్‌ను మైసూరులో తయారు చేస్తారు. 5.1 పాయింట్ ఒక మిల్లీలిటర్ల సీసాలోని ఇంకుతో… 7 వందల మంది ఓటర్లకు సరిపోయేలా దీన్ని తయారు చేస్తారు. మరికొన్ని రోజుల్లో జరిగే ఎన్నికల కోసం ఈసీ దాదాపుగా 26 లక్షల ఇంకు బాటిళ్లను ఆర్డర్ చేసింది. వీటిని ఆయా రాష్ట్రాల్లోని ఓటర్ల సంఖ్యను బట్టి సరఫరా చేస్తారు. ఇక ఈ ఇంకును కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వాడుతారు.. కానీ కరోనా వేవ్ అప్పుడు.. కోవిడ్ బారిన పడి క్వారెంటైన్లో ఉన్నవారిని గుర్తించడానికి దీన్ని ఉపయోగించారు.
పోలింగ్ బూత్‌లలో వేసే సిరా గుర్తు పై కొన్ని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలు ఒక్కపుడు బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించే వారు.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. టెక్నాలజీ ఓ రేంజ్లో పెరిగిపోయింది. దానికి అనుగుణంగా ఎన్నిక నిర్వహణలో సాంకేతికతను విస్తృతంగా వాడుతున్నారు.. చాలా వరకు ప్రస్తుతం ఈవీఎం మిషన్లతోనే ఓటింగ్ ప్రక్రియ సాగుతోంది. కానీ డబుల్ ఓటింగ్ నియంత్రణకు ఇంకా సిరానే నమ్ముకున్నారు అధికారులు. భారత్‌లో ఆధార్ కార్డు అన్నింటికి అనుసంధానం చేస్తున్నారు. అందులో ఓ వ్యక్తి చేతి ముద్రలు, కంటి ఐరిస్‌లు చేర్చుతారు.. దీని ద్వారా ఆ వ్యక్తి గుర్తింపు స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే విధానాన్ని ఓటింగ్ విధానానికి వాడితే మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది . ఆధార్ లాంటి విధానం ఎన్నికల గుర్తింపు కార్డుకు చేరిస్తే బాగుటుందని కొందరు మేధావులు చెబుతుంటే… మరి కొందరు ఆధార్‌తోనే ఓటు వేసే విధానం తెస్తే చాలా బాగు0టుందని అభిప్రాయపడుతున్నారు.
Discussion about this post