సోము వీర్రాజు.. ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు.. ముప్పయియేళ్ళుగా పార్టీని నమ్ముకున్న పెద్ద మనిషి. పార్టీ కోసం అహరహం శ్రమించిన అసలు సిసలు కార్యకర్త. వీర్రాజు ఎంతగా ప్రయత్నించినా బీజేపీ టిక్కెట్ దక్కలేదు. . వాస్తవానికి రాజమండ్రి లోక్ సభ టిక్కెట్ కోసం సోము వీర్రాజు చివరి నిమిషం వరకూ ప్రయత్నించారు.. అయితే రాజమండ్రి టిక్కెట్ ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కి ఇచ్చారు..అయితే ఆమె అక్కడ నుంచి పోటీ చేయడానికి అంత ఆసక్తి చూపడం లేదు. ఆమె మనసంతా విశాఖ సీటుపైనే ఉంది. ఆమె సంగతి పక్కన బెడితే సోము వీర్రాజు కనీసం అనపర్తి అసెంబ్లీ స్థానం ఇచ్చినా పోటీ చేయాలనీ ఆశపడ్డారు. కానీ కూటమిలో భాగంగా అనపర్తి టిక్కెట్ టీడీపీకి కేటాయించారు. అక్కడ నుంచి కూటమి అభ్యర్థి బరిలోకి దిగనున్నారు.దీంతో సోము వీర్రాజు కి నిరాశే మిగిలింది. పార్టీ కోసం ఎంతో కాలంగా నిజాయితీగా పని చేసినందుకు ఆయనకు దక్కిన గౌరవమిది.
టీడీపీ ముద్ర ఉన్న వారికి సీట్లు ఇవ్వకూడదని నిర్ణయించినట్టు … పూర్తిగా పార్టీ శ్రేణులకే సీట్లు ఇవ్వాలని పార్టీ అగ్ర నేతలు డిసైడ్ అయినట్టు ప్రచారం జరిగింది కానీ వాస్తవంలో అలా జరగలేదు.అవన్నీ గాలి మాటలని తేలిపోయింది. చివరికి ఏదో ఒక పార్టీ ముద్ర ఉన్న నేతలకే టిక్కెట్లు ఇచ్చారు. టీడీపీ ముద్ర ఉన్న సీఎం రమేష్ కి అనకాపల్లి టిక్కెట్ ఇచ్చారు. ఆయనది కడప జిల్లా.. ఎవరూ ఊహించని విధంగా వైసీపీ నుంచి వచ్చిన వరప్రసాద్ కి రాత్రికి రాత్రే తిరుపతి టిక్కెట్ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన పురంధేశ్వరికి పార్టీ అధ్యక్ష పదవి తో పాటు రాజమండ్రి టిక్కెట్ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట టిక్కెట్ ఇచ్చారు. మరో సీనియర్ నేత సత్యకుమార్ హిందూపురం, రాజంపేటలలో ఏదో ఒక ఎంపీ సీటు కావాలని ఆశించారు. కానీ, అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వైపే మొగ్గు చూపింది.. అలా పార్టీ అగ్రనేతలు యే ముద్రలు లేనివారికి పంగనామాలు పెట్టారు.భీమవరం లో మాత్రం పార్టీ నాయకుడు శ్రీనివాసవర్మ కు టిక్కెట్ ఇచ్చారు.గుడ్డిలో మెల్లగా ఇక్కడే కొంత న్యాయం జరిగిందని చెప్పుకోవాలి.
ఇక విశాఖ లోకసభ టిక్కెట్ పార్టీ నేత జి వి ఎల్ నరసింహారావు ఆశించారు. తన స్థాయిలో ప్రయత్నాలు చేశారు. కానీ టిక్కెట్ రాలేదు. ఆయన రాజ్యసభ మెంబర్గా చేశారు కాబట్టి టిక్కెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు .. అలాగే విష్ణు వర్ధన్ రెడ్డి కూడా టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఆయనకు మొండిచేయి చూపారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిన తరువాత నాటి రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ తో పాటుగా, వరదాపురం సూరి, ఆదినారాయణ రెడ్డి లాంటి వారు తెలుగు దేశం పార్టీ లో చేరారు. వీరిలో పలువురు టిక్కెట్లు ఆశించారు. అయితే సీఎం రమేష్ ఒక్కరికే ఛాన్స్ దక్కింది. మొత్తం మీద ఆరు లోక సభ సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే.. వారిలో ఐదుగురు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తే బీజేపీ ఏ ప్రమాణాలను పాటిస్తున్నదో ఇట్టే తెలిసిపోతుంది. సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ అసెంబ్లీ స్థానం ఇచ్చే అవకాశాలున్నాయి.
కాగా సోము వీర్రాజు విషయానికొస్తే కొన్నాళ్ళు ఆయన ఎం.ఎల్.సి గా చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వీర్రాజు మొదటి నుంచి నమ్మకంగా బీజేపీ అభివృద్ధి కోసమే పని చేశారు. ఇన్నాళ్లుగా పనిచేస్తున్నప్పటికీ పార్టీ ఆయన సేవలను గుర్తించకపోవడం శోచనీయమని వీర్రాజు వర్గీయులు అంటున్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా ప్రయోజనం లేకపోయిందని ఎవరి సూచనలతో టిక్కెట్లు కేటాయింపు జరుగుతున్నదో అర్ధం కావడం లేదని టిక్కెట్లు దొరకని నేతలు వాపోతున్నారు. వీర్రాజు అధ్యక్ష పదవిలో ఉండగా టీడీపీ పై విరుచుకు పడేవారు. దాంతో ఆయన జగన్ మనిషి అనే ముద్ర వేశారు. కానీ వాస్తవానికి వీర్రాజు పార్టీ కోసమే పని చేశారు కానీ ఏ వ్యక్తుల తరపున పని చేయలేదు.
Discussion about this post